Skip to main content

National Policy on Menstrual Hygiene: ఋతుస్రావంపై సుప్రీమ్ కోర్ట్ కీల‌క ఆదేశాలు

ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.
National policy on menstrual hygiene

శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్‌ గత సోమవారం అన్నమాట అలాంటిదే.

Abortion rules and Laws: అబార్షన్‌ల‌పై భిన్నాభిప్రాయాలు

ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్‌ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్‌ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట.

ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్‌ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్‌ ఆదేశించింది. తాజాగా, కోర్ట్‌లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు  జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్‌లైన్‌లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది.

తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. 

WHO Comment's on Indian's Health: భారతీయుల ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్‌హెచ్‌) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్‌లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్‌ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లో దీన్ని చేర్చారు.

కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్‌ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్‌హెచ్‌ కూడా ఒకటనేది గమనార్హం.

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్‌’, రాజస్థాన్‌లో ‘ఉడాన్‌’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్‌ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది.

పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్‌ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి.

Unitary, Federal Systems: ఏకీకృత, సంకీర్ణ ప్రభుత్వాల గురించి చరిత్ర ఏం చెబుతోంది...

తగిన ఎంహెచ్‌హెచ్‌ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి.

విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్‌ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. 

ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు.
కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్‌ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. 

Fundamental rights should include the right to vote: ప్రాథమిక హక్కుల్లో ఓటు హక్కును చేర్చాలి

Published date : 14 Nov 2023 05:44PM

Photo Stories