Skip to main content

WHO Comment's on Indian's Health: భారతీయుల ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది.
18.83 Crore People with High Blood Pressure,WHO Comment's on Indian's Health,National High Blood Pressure Statistics
WHO Comment's on Indian's Health

మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది.

Generic Medicines: అస‌లు ఈ జెనరిక్‌ మందులు నాసిరకమైనవా? ప్రయోజనక‌ర‌మైన‌వా...

బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్‌ఓ చెబుతున్న ఈ మాటలు భారత్‌లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. 
ప్రపంచవ్యాప్త హైపర్‌టెన్షన్‌ ప్రభావంపై డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది.
పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్‌ కిల్లర్‌’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు.
భారత్‌లో గుండెపోటు, స్ట్రోక్‌లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. 

Benifits of Trees: నగరాలకు చెట్లు అందించే 12 ప్రయోజనాలివే!

అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌ ఇనీషియేటివ్‌’ (ఐహెచ్‌సీఐ)ను 2017 నవంబర్‌లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్‌ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్‌ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్‌ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. 

UN: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది

సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం.
ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సున్నా, భారత్‌లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. 

ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి

గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్‌ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది.
జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్‌ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. 

Global Innovation Index 2023: 40 స్థానంలో భారత్‌

Published date : 30 Sep 2023 10:00AM

Photo Stories