Skip to main content

Maha Kumbh Mela: మహా కుంభమేళా.. 144 ఏళ్ల తర్వాత వచ్చిన గొప్ప వేడుక

మహా కుంభమేళా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు.. 45 రోజులపాటు జరిగే ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం  ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. 40 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించబోతున్నారని అంచనా. మకర సంక్రాంతి పర్వదినం నుంచి భక్తుల సందడి ప్రారంభం కానుంది.

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, సాంస్కృతిక ఉత్సవంగా కుంభమేళా రికార్డుకెక్కింది. సాధారణంగా కుంభమేళాను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ ఏడాది యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరుగబోతున్న మహా కుంభమేళా. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  
 
కుంభమేళా ఎలా మొదలైంది?  
కుంభమేళా మూలాలు హిందూ పురాణాల్లో ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసిన విషయం తెలిసిందే.  సముద్రం నుంచి ఒక కుంభం(కుండ)లో అమృతం పైకి తేలింది. అమృతం రాక్షసుల చేతికి దక్కకూడదన్న ఉద్దేశంతో మహా విష్ణువు ఈ కుంభాన్ని తన ఆ«దీనంలో ఉంచుకున్నారు. అసురులు ఆయనను వెంబడించారు.

మహా విష్ణువు అమృతభాండంతో ముందుకు పరుగులు తీస్తుండగా, కొన్ని అమృతం చుక్కలు నాలుగు చోట్ల పడిపోయాయి. అవే ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌. అందుకే ఇవి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. కుంభం నుంచి అమృతం పడిన చోట కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 

Maha Kumbh Mela: మహా కుంభమేళాకు ఏర్పాట్లు.. కుంభమేళా అంటే ఏమిటి..? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే..!

నాలుగు రకాల కుంభమేళాలు  

  • కుంభమేళా(నాలుగేళ్లకోసారి)   
  • అర్ధ కుంభమేళా(ఆరేళ్లకోసారి)  
  • పూర్ణ కుంభమేళా(12 ఏళ్లకోసారి)  
  • మహా కుంభమేళా(144 ఏళ్లకోసారి)

ఏడాదికోసారి మాఘమేళా  
ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి సంవత్సరం మాఘ మేళా జరుగుతుంది. దీనిని ‘చోటా కుంభ్‌’ అని పిలుస్తారు. హిందూ క్యాలెండర్‌ ప్రకా రం జనవరి–ఫిబ్రవరిలో ఈ మాఘమేళా నిర్వహిస్తారు.  

మహా కుంభమేళాలో షాహీ స్నానాల తేదీలు  

  • జనవరి 13: పుష్య పూర్ణిమ స్నానం 
  • జనవరి 15: మకర సంక్రాంతి స్నానం 
  •  జనవరి 29: మౌని అమావాస్య స్నానం 
  • ఫిబ్రవరి 3:  వసంత పంచమి స్నానం  
  • ఫిబ్రవరి 12:  మాఘ పూర్ణిమ స్నానం  
  • ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం    

ఏ మేళా ఎప్పుడంటే..
ఈ వేడుక దేశంలో నాలుగుచోట్ల (హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్‌) నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని పవిత్ర నదులు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తద్వారా పాప విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నది, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షిప్రా నది, మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నది, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉన్నాయి.  

అర్ధ కుంభమేళా: ప్రయాగ్‌రాజ్, హరిద్వార్‌లో ఆరేళ్లకోసారి అర్ధ కుంభమేళా జరుగుతుంది.   
పూర్ణ కుంభమేళా: ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. గ్రహగతుల ఆధారంగా పూర్ణ కుంభమేళా తేదీలను నిర్ణయిస్తారు. పుణ్య స్నానాల కోసం కోట్లాది మంది తరలివస్తారు.  
మహా కుంభమేళా:  12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత మహా కుంభమేళా జరుగుతుంది. అంటే 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. మహా కుంభమేళాలను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా అఖాడాలు, నాగా సాధువుల ఆధ్వర్యంలో ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమలు జరుగుతాయి. మరో మహాకుంభమేళా కోసం 144 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. కొందరు తమ జీవిత కాలంలో మహా కుంభమేళాను చూడలేకపోవచ్చు కూడా.

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

Published date : 09 Jan 2025 01:48PM

Photo Stories