Tomato Flu: కేరళలో కొత్త రకం వైరస్ టమాటో ఫ్లూ కలకలం
కేరళలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. అంతుచిక్కని టమాటో ఫ్లూ కారణంగా అనేక మంది చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వైరస్‌ను టమాటో జ్వరంగా కూడా పిలుస్తున్నారు. ఇది అత్యంత అరుదైన వైరస్ వ్యాధిగా నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చర్మంపై ఎర్రటి బొబ్బలు వస్తాయి. అవి ఎర్రగా, టమాటో ఆకారంలో ఉండటంతో ఈ వ్యాధికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన పిల్లల్లో శరీరంపై చాలాచోట్ల బొబ్బలు వస్తాయి. దీంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు,బలహీనత, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి. కొందరు పిల్లల్లో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతుల వంటి లక్షణాలు కూడా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధికి గల కారణాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి కేరళలోని కొల్లం జిల్లాలో మాత్రమే ఈ కేసులు నమోదయ్యాయి.