International Labour Organization Report: దేశ సగటుకు మించి ఏపీలో ఆక్వా దిగుబడులు!
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో మత్స్య ఉత్పత్తులు పెరగడమే కాకుండా, ఈ రంగంలో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. ఆక్వా రంగంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం నిలుస్తోంది. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల దిగుబడి దేశ సగటు దిగుబడిని మించి ఉంది. దేశ సగటు దిగుబడి హెక్టార్‌కు 7.5 టన్నులు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 8.8 టన్నులు ఉంది.
ఒడిశా రాష్ట్రంలో ఇది 4.1 శాతమే ఉంది. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ లోతైన అధ్యయనం చేసి వెల్లడించిన వివరాలివి. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఆక్వా రంగంలో అవకాశాలు, సవాళ్లను మ్యాపింగ్ చేయడం, ఈ రంగంలో ఫుడ్ ప్రోసెసింగ్ అవకాశాలను, ఎంఎస్‌ఎంఈల పని తీరును మెరుగుపరచడం ద్వారా ఉద్యోగావకాశాల మెరుగుకు ఈ అధ్యయనం చేసినట్లు నివేదిక పేర్కొంది.
భారత దేశంలో రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలది ఆధిపత్యమని తెలిపింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 71,900 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తులు సాగవుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో అత్యధికంగా 6,34,672 టన్నుల రొయ్యలు ఉత్పత్తవుతున్నట్లు వెల్లడించింది.
Coromandel: ఏపీలో కోరమాండల్ ప్లాంటు నిర్మాణం ప్రారంభం.. ఎక్కడంటే..
ఒడిశాలో 10,600 హెక్టార్లలో ఆక్వా ఉత్పత్తుల సాగు ఉండగా 43,677 మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 91 శాతం ప్రాసెస్ చేయని చేప ఉత్పత్తులనే విక్రయిస్తున్నారని, ఆక్వా ఉత్పత్తులు ప్రోసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
ఆహార ప్రోసెసింగ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ మెరుగుపడుతుందని పేర్కొంది. ఎక్కువ పోషక విలువలు గల రొయ్యల ప్రోసెస్‌డ్ ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పింది. ఉత్పత్తి సమయంలో రసాయనాల వినియోగం తగ్గించడంతో పాటు ప్రోసెసింగ్ చేసిన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని నివేదిక పేర్కొంది.
ఎగుమతి చేసే ఆక్వా ఉత్ప్తులకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 19,894 సంస్దలు ఉన్నాయని, 105 ఫ్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లు, 99 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయని, 74 మంది మాన్యఫ్యాక్చర్ ఎగుమతిదారులతో పాటు 69 మర్చంట్ వ్యాపారులు ఉన్నారని నివేదిక తెలిపింది. రొయ్యల ప్రాసెసర్‌ల శ్రామిక శక్తిలో 70–80 శాతం మంది మహిళలు ఉన్నట్లు అంచనా వేసింది.
Aurobindo Pharma: ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం.. ట్రయల్ రన్ ఎప్పుడంటే..
ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఆక్వా రంగంలో ఈ వృద్ధి సాధ్యమైందని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020–25 ఆహార ప్రాసెసింగ్ విధానాన్ని ప్రకటించి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోందని, అలాగే మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ మందికి స్థానికంగా ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టిందని వివరించింది. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ కేంద్రాలను అభివృద్ధి ద్వారా ఆక్వాకు పెద్ద ఎత్తున చేయూతనిస్తోందని తెలిపింది. ఆక్వాలో ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అత్యధిక అవకాశాలున్నాయని పేర్కొంది.