PM Narendra Modi: ఘనంగా జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఆయనకిది వరుసగా పదకొండోసారి.
రంగాలవారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని 98 నిమిషాల పాటు వివరించారు. తద్వారా అత్యంత ఎక్కువ సమయం పాటు పంద్రాగస్టు ప్రసంగం చేసిన ప్రధానిగా సొంత రికార్డు (94 నిమిషాల)నే అధిగమించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.
2014లో ఎర్రకోట నుంచి తొలిసారి ప్రధానమంత్రిగా ప్రసంగం చేసిన ఆయన 65 నిమిషాల పాటు మాట్లాడారు.
కొత్తగా 75,000 వైద్య సీట్లు
‘వైద్య విద్య కోసం మన యువత విదేశీ బాట పడుతోంది. ఇందుకోసం మధ్యతరగతి తల్లిదండ్రులు లక్షలు, కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అనామక దేశాలకు కూడా వెళ్తున్నారు’ అని మోదీ ఆవేదన వెలిబుచ్చారు. వచ్చే ఐదేళ్లలో 75 వేల వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
‘మహిళలపై అకృత్యాలకు తెగించేవారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. ఉరి తప్పదన్న భయం రావాలి. మహిళలను ముట్టుకోవాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి కల్పించడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసుల్లో పడ్డ శిక్షల గురించి అందరికీ తెలిసేలా మీడియాలో విస్తృత ప్రాచుర్యం కల్పించాలి. అప్పుడే ప్రజల్లో తిరిగి విశ్వాసం పాదుగొల్పగలం’ అన్నారు.
ఈ సందర్భంగా.. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొన్న భారత అథ్లెట్లకు మోదీ అభినందనలు తెలిపారు.
రాజస్తానీ రంగుల తలపాగా
మోదీ తన మొదటి టర్మ్ (2014) నుంచి తన మూడవ టర్మ్ (2024) వరకు ప్రతి సంవత్సరం వేర్వేరు తలపాగాలు ధరిస్తూ కనిపించారు. ఈ ఏడాది ప్రధాని మోదీ తలపాగా స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. కాషాయి, ఆకుపచ్చ, పసుపు రంగులతో కూడిన రాజస్థానీ తలపాగాలో కనిపించారు. తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు నీలిరంగు కోటు ధరించాడు.
Independence Day: వరుసగా 11వ సారి.. ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన ఘనత