Electoral Bonds: అసలేమిటీ ఎన్నికల బాండ్లు.. ఎవరు జారీ చేస్తారు..?
ఎన్నికల బాండ్లు.. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచ్చిన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖ విలువతో ఉంటాయి.
జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు.
ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15వ తేదీ తీర్పు చెప్పింది.
Supreme Court of India: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం.. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ!!
ఇవీ అభ్యంతరాలు..
► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు.
► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది.
► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం.
► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది.
► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు.
► దేనిపై వెచ్చించాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు.
► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది.
► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది.
► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది.
అత్యధిక వాటా బీజేపీదే..
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి.