Skip to main content

Supreme Court of India: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం.. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ!!

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ కుండబద్దలు కొట్టింది. 2018లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పారదర్శకత, నల్లధనం కట్టడి కోసమే పథకం తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. 

ఈ పథకం కింద ఇప్పటిదాకా కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం, కొనుగోలుదారులు, స్వీకర్తల పేర్లు తదితరాల వివరాలన్నింటినీ వెల్లడించాల్సిందేనని ఆదేశించింది. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ‘ఓటేసేందుకు పౌరులకు ఉన్న స్వేచ్ఛపై ఎలాంటి అవాంఛిత ఒత్తిళ్లూ ఉండరాదు.

ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతేగాక ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ప్రభుత్వాల ప్రజాస్వామిక స్ఫూర్తికి అత్యంత కీలకం. అందుకే రాజ్యాంగం కూడా స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యమిచ్చింది. కార్పొరేట్ల నుంచి పార్టీలకందే ఆర్థిక విరాళాలకు రెండు కారణాలుంటాయి. తద్వారా తమ మద్దతును వ్యక్తీకరించడం.

లేదా సదరు విరాళాలు క్విడ్‌ ప్రొ కో తరహావి కావడం. పరిమిత స్థాయిలో ఉండే వ్యక్తిగత విరాళాలను, అపరిమితమైన కార్పొరేట్‌ విరాళాలను ఒకే గాటన కట్టలేం. కార్పొరేట్‌ విరాళాలు స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాయి. కనుక సంస్థలు, కంపెనీల నుంచి పార్టీలకు అందే భారీ విరాళాలకు కారణాలను గోప్యంగా ఉంచడాన్ని అనుమతించరాదు’ అని స్పష్టం చేసింది. కేవలం ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ఆది, అంతం కావంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Bharat Rice: మార్కెట్‌లోకి ‘భారత్‌ రైస్‌’.. రూ.29కే కిలో బియ్యం..

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా రెండు విడి తీర్పులు రాశారు. మోదీ సర్కారుకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్న ఈ తీర్పుపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ హర్షం వెలిబుచ్చాయి. పలువురు మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా తీర్పును సమర్థించడం విశేషం. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కూడా ఉన్నారు. తనతో పాటు జస్టిస్‌ గవాయ్‌ తరఫున సీజేఐ 152 పేజీల తీర్పు, తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ పార్డీవాలా, జస్టిస్‌ మిశ్రాల తరఫున జస్టిస్‌ ఖన్నా 74 పేజీల తీర్పు వెలువరించారు.

చాలా లోపాలున్నాయి..
ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై ధర్మాసనం 2023 అక్టోబర్‌ నుంచి వాదనలు ఆలకిస్తూ వస్తోంది. ఈ పథకం రహస్య బ్యాలెట్‌ విధానం వంటిదేనని, విరాళాలిచ్చేవారి గోపనీయతను కాపాడుతుందని కేంద్రం చేసిన వాదన లోపభూయిష్టమని తాజా తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. బాండ్లను కొనుగోలు చేసేలా వ్యక్తులను, సంస్థలను ఈ పథకం ద్వారా ఒత్తిడి చేయవచ్చని పేర్కొంది.

బాండ్‌పై దాత పేరుండదు గనుక అవి ఎవరి నుంచి వచ్చాయన్న ఆ విరాళాన్ని అందుకునే పార్టీకి కూడా తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదననూ తోసిపుచ్చింది. ‘ఈ పథకం లోపరహితం కాదు. విరాళాలు ఇచ్చిందెవరో పార్టీలు తెలుసుకునేందుకు అవకాశం కల్పించే లోపాలెన్నో ఇందులో ఉన్నాయి’ అని స్పష్టం చేసింది. ‘పౌరులు రాజకీయ విశ్వాసాలు, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం వారి రాజకీయ వ్యక్తీకరణలో తొలి దశ.

అందుకే పౌరుల రాజకీయ విశ్వాసాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) రక్షణ కల్పిస్తోంది. కానీ ఈ పథకం నిబంధనల ప్రకారం బాండ్ల కొనుగోలుదారుల వివరాలను ఓటర్లకు తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. ఇది కల్పిస్తున్న రాజ్యాంగం కల్పిస్తున్న భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే’’అంటూ తప్పుబట్టింది. అంతేగాక కార్పొరేట్‌ సంస్థలు పార్టీలకు అపరిమితంగా విరాళాలు అందజేసేందుకు వీలు కల్పించేలా కంపెనీల చట్టంలోని నిబంధనను తొలగించడం ఆరి్టకల్‌ 14 ద్వారా రాజ్యాంగం కల్పిస్తున్న సమానత్వపు హక్కుకు విరుద్ధమని పేర్కొంది.

Ayodhya: ‘రామాలయం’ సమీపాన ఆ రాష్ట్ర భవనం..!

ఎన్నికల బాండ్ల పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటిదాకా దీనికింద కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 6కల్లా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని బాండ్ల జారీ అ«దీకృత సంస్థ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించింది. ప్రతి బాండ్‌ ముఖ విలువ, కొనుగోలు తేదీ, కొనుగోలుదారు పేరు, తద్వారా పారీ్టలవారీగా అందుకున్న విరాళాలు వంటి అన్ని వివరాలనూ పొందుపరచాలని పేర్కొంది.

వాటన్నింటినీ మార్చి 13 కల్లా ఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. ఇంకా నగదుగా మార్చుకోని బాండ్లను సంబంధిత పారీ్టలు తిరిగి ఎస్‌బీఐలో జమ చేయాలని, సదరు మొత్తాలను కొనుగోలుదారు ఖాతాకు బ్యాంకు జమ చేయాలని ఆదేశించింది. పార్టీలు బాండ్ల ద్వారా తమకందిన విరాళాల పూర్తి వివరాలను ఈసీకి సీల్డ్‌ కవర్లో సమ‌ర్పించాలని 2019 ఏప్రిల్‌ 12న ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించడం తెలిసిందే.
 
గోప్యత కీలకం: సీజేఐ
రాజకీయ పార్టీకి అందే విరాళాల గురించిన సమాచారం ఓటరుకు తెలియడం తప్పనిసరని సీజేఐ తన తీర్పులో పేర్కొన్నారు. అప్పుడే ఓటు హక్కును ప్రభావవంతంగా వినియోగించుకోగలడన్నారు. ‘ఎన్నికల వ్యయంలో నల్లధనం కట్టడికి బాండ్లే ఏకైక మార్గం కాదు. దీనితో పోలిస్తే సమాచార హక్కు స్ఫూర్తికి గండి కొట్టని మెరుగైన ఇతర మార్గాలెన్నో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ విరాళాలనూ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలుగా చూడలేం.

చట్టసభల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేని పార్టీలకు కూడా విరాళాలందుతున్నాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు, విధానాలను ప్రభావితం చేసేందుకు డబ్బు ఎంతో అవసరం. ఎన్నికల్లో ప్రజాస్వామికంగా పాల్గొనేందుకు కూడా డబ్బు కావాల్సిందే’ అన్నారు. అయితే, ‘వ్యక్తుల రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన సమాచారాన్ని అసమ్మతిని అణచివేసేందుకు ప్రభుత్వం రాజకీయంగా వాడుకునే ఆస్కారముంది.

అంతేగాక సదరు వ్యక్తులకు ఉద్యోగావకాశాల వంటివాటిని నిరాకరించే ప్రమాదం కూడా ఉంది. అంతేగాక అవి మెజారిటీ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే పక్షంలో వారిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే పౌరులకు తమ రాజకీయ విశ్వాసాలను గోప్యంగా ఉంచుకునే హక్కు చాలా ముఖ్యం’ అని సీజేఐ అన్నారు. గోప్యత హక్కుకు రాజ్యంగపరమైన రక్షణ ఉంటుందంటూ 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Vande Bharat Sleeper Train: పట్టాలెక్కనున్న ‘స్లీపర్‌ వందే భారత్‌’.. తొలిసారి పరుగులు తీసే రూట్‌ ఇదే..!

‘ఓటు ఎవరికేస్తున్నదీ గోప్యంగా ఉంచే హక్కు లేకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. తమకు వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లను తొలగించేందుకు వాడుకునే ప్రమాదమూ ఉంది. నియోజకవర్గాలను కూడా ఓటర్ల రాజకీయ మొగ్గుదల ఆధారంగా విభజించే ఆస్కారముంది. అప్పుడు ఎన్నికల వ్యవస్థకే అర్థం లేకుండా పోతుంది’ అని ఆందోళన వెలిబుచ్చారు. కాకపోతే ఈ గోప్యత హక్కును పార్టీలకు అందే విరాళాలకు కూడా వర్తింపజేయవచ్చా అన్నదే ప్రశ్న అని సీజేఐ చెప్పారు. పార్టీలకు ఆర్థిక విరాళాలకు కూడా రాజ్యంగపరమైన రక్షణ ఉందా అన్న అంశంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

క్విడ్‌ ప్రొ కోకు ఆస్కారం..
పారీ్టలకు భారీగా ఆర్థిక విరాళాలిచ్చే వారి ఉద్దేశమేమిటన్నది బహిరంగ రహస్యమేనని సీజేఐ అన్నారు. సాధారణంగా కార్పొరేట్‌ విరాళాల ఉద్దేశం క్విడ్‌ ప్రొ కో ప్రయోజనాలేనన్న వాదనతో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా విభేదించలేదని గుర్తు చేశారు. రాజకీయ సమానత్వానికి మన దేశంలో రాజ్యాంగ రక్షణ ఉన్నా ఆ విషయంలో ఇప్పటికీ అసమానత కొనసాగుతూనే ఉందని సీజేఐ ఆవేదన వెలిబుచ్చారు.

‘రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో వ్యక్తుల సామర్థ్యంలో అసమానతలున్నాయి. ఆర్థిక అసమానతలే అందుకు కారణం. పార్టీలకందే ఆర్థిక సాయాన్ని కూడా ఈ అసమానతలు నియంత్రిస్తున్నాయి. సంపన్నులకు పార్టీలకు భారీ ఆర్థిక విరాళమిచ్చే సామర్థ్యముంటుంది. తద్వారా ప్రజాప్రతినిధులకు దగ్గరయ్యేందుకు, ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు కూడా అవకాశముంటుంది.

ఇది వారికి కావాల్సిన లైసెన్సులివ్వడమో, వారికి అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసుకోవడమో జరగే ఆస్కారముంది. ఇలా క్విడ్‌ ప్రొ కో జరిగే అవకాశముంది’ అన్నారు. రాజకీయ సమానత్వాన్ని పాటించే సమాజంలో పౌరులందరికీ రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసే విషయంలో సమానంగా గళమెత్తే అవకాశం చాలా కీలకమని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి జస్టిస్‌ ఖన్నా తన తీర్పులో పలు కారణాలను ఉటంకించారు.
 
స్పందనలు..
‘ఈ తీర్పు ద్వారా నల్లధన మార్పిడి వ్యవస్థను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కేంద్రం ఇప్పటికైనా ఇలాంటి మతిలేని ఆలోచనలు కట్టిపెడుతుందని ఆశిస్తున్నా. ఎన్నికల బాండ్ల పథకం కింద 95 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయి’  – కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
 
‘మోదీ ప్రభుత్వ అవినీతి విధానాలకు ఇది మరో నిదర్శనం. ఎన్నికల బాండ్లను లంచాలు, కమిషన్లు తీసుకునే మార్గంగా బీజేపీ మార్చుకుంది. దీనికి సుప్రీంకోర్టు తెర దించింది’  – కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ
 
‘ఎన్నికల బాండ్లు సదుద్దేశంతో తెచ్చిన పథకం. విపక్షాలు దీన్ని అవసరంగా రాజకీయం చేస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం’  – బీజేపీ
 
‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తెచ్చేందుకు ఇదెంతగానో దోహదపడుతుంది’ – ఆమ్‌ ఆద్మీ పార్టీ
 
‘పాలక పార్టీ లబ్ధి కోసం తీసుకొచ్చిన అక్రమ పథకానికి సుప్రీంకోర్టు తీర్పు తెర దించింది’  – సీపీఎం
 
‘తీర్పును స్వాగతిస్తున్నాం. ఎన్నికల బాండ్లు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధం’  – సీపీఐ (ఎంఎల్‌)
 
‘ఇది గత ఆరేడేళ్లలో వెలువడ్డ అత్యంత చరిత్రాత్మక తీర్పు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని ఈ తీర్పు పునరుద్ధరిస్తుంది’.  – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ
 
‘తీర్పు స్వాగతించదగ్గదే. అయితే ఎన్నికల నిధుల వ్యవస్థ ప్రక్షాళనకు చేయాల్సింది చాలా ఉంది’ – కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎన్‌.గోపాలస్వామి.

Snow Leopards: దేశంలో 718 మంచు చిరుతలు

Published date : 16 Feb 2024 03:47PM

Photo Stories