Bharatiya Janata Party: సేవా ఔర్ సమర్పణ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజకీయ పార్టీ?
కోవిడ్–19 వ్యాక్సినేషన్‌లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్ పోర్టల్ గణాంకాల ప్రకారం... దేశంలో సెప్టెంబర్ 17న ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
సేవా ఔర్ సమర్పణ్..
ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని... భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ‘సేవా ఔర్ సమర్పణ్ అభియాన్’కి సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 7 వరకు 20 రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా... దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడతారు.
1950 సెప్టెంబర్ 17న జననం...
గుజరాత్ రాష్ట్రం మెహసానా జిల్లా వద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో చేరారు. అనంతరం బీజేపీలో చేరి 2001, అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014, మే 26 తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
చదవండి: భారత్‌లో నేరాలు–2020 నివేదికను విడుదల చేసిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సేవా ఔర్ సమర్పణ్ అభియాన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా
ఎక్కడ : బీజేపీ కార్యాలయం, న్యూఢిల్లీ
ఎందుకు : ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని... దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు...