NCRB Report: భారత్‌లో నేరాలు–2020 నివేదికను విడుదల చేసిన సంస్థ?
Sakshi Education
2020 సంవత్సరంలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు, ఘోరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2021, సెప్టెంబర్ 15న వెల్లడించింది. భారత్‌లో నేరాలు–2020 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని వివరాల ప్రకారం...
- 2020 ఏడాది మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
- మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి.
- 2019తో పోలిస్తే 2020 ఏడాదిలో మహిళలపై నేరాలు 8.3 శాతం తగ్గాయి.
- రాజస్తాలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరగగా.. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి.
- 2020లో కరోనా లాక్‌డౌన్ వల్ల దొంగతనాలు, దోపిడీలు, మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు వంటివి కాస్త తగ్గాయి.
28 శాతం పెరిగిన నేరాల సంఖ్య...
- మొత్తం నేరాల సంఖ్య 2019లో 51,56,158 ఉండగా, 2020లో 28 శాతం పెరిగి 66,01,285కి చేరింది.
- అత్యధికంగా తమిళనాడులో 2019లో 4,55,094 కేసులు నమోదుకాగా, 2020లో 13,77,681కి నేరాల సంఖ్య చేరుకున్నాయి.
- దేశం మొత్తమ్మీద 2020 ఏడాది 29,193 హత్యలు జరిగితే యూపీలో 3,779 హత్యలు జరిగాయి. 2019తో పోల్చి చూస్తే హత్యలు ఒక్క శాతం పెరిగాయి.
- హత్యల్లో యూపీ తర్వాత స్థానంలో బిహార్ (3,150), మహారాష్ట్ర (2,163), మధ్యప్రదేశ్ (2,101) ఉన్నాయి.
11.8 శాతం పెరిగిన సైబర్ నేరాలు
- ఆన్‌లైన్‌లో జరిగే నేరాలు, ఘోరాలు పెరిగాయి. 2019తో పోలిస్తే 11.8 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తంగా 50,035 కేసులు నమోదయ్యాయి.
- సైబర్ నేరాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 11,097 కేసులు నమోదు కాగా, కర్ణాటక (10,741), మహారాష్ట్ర (5,496), తెలంగాణ (5,024) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
- కోవిడ్ నిబంధనలను యదేచ్ఛగా అతిక్రమించిన కేసులు గత ఏడాది అత్యధికంగా నమోదయ్యాయి.
మొత్తం నేరాలు | 66,01,285 |
ఐపీసీ కింద నమోదైన నేరాలు | 42,54,346 |
ఇతర చట్టాల కింద నేరాలు | 23,46,929 |
నేరాల రేటు | |
2019 | 7.2 |
2020 | 6.7 |
చదవండి: నీట్ పరీక్ష నుంచి మినహాయించాలని ప్రత్యేక బిల్లును ఆమోదించిన రాష్ట్రం?
Published date : 16 Sep 2021 12:58PM