Skip to main content

Nayab Singh Saini: హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారం

హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్‌ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు.
Haryana New Chief Minister Nayab Singh Saini Oath Taking Ceremony

పంచకులలోని దసరా గ్రౌండ్‌లో అక్టోబ‌ర్ 17వ తేదీ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. 

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో.. అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయెల్, అరవింద్ కుమార్ శర్మ, శృతి చౌదరి, శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ సింగ్ గాంగ్వా, క్రిషన్ బేడీ, గౌరవ్ గౌతమ్, ఆర్తి సింగ్ రావు, రాజేష్ నగర్ ఉన్నారు.

అక్టోబ‌ర్ 17వ తేదీ వాల్మీకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది.  
 
ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 

Omar Abdullah: ఎంపీగా ఓడిన కొద్ది రోజులకే.. సీఎం పీఠంపై కూర్చున్న ఒమర్‌ అబ్దుల్లా!
 
బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం   
బీజేపీ సీనియర్‌ సీనాయకుడు నాయబ్‌సింగ్‌ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచ్చింది. 

హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్‌ మాజ్రా గ్రామంలో జన్మించారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 

2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్‌ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్‌ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్‌ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్‌ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్‌ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.

Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన‌ ఒమర్ అబ్దుల్లా

Published date : 19 Oct 2024 09:47AM

Photo Stories