AP CM YS Jagan : కొత్తగా లక్షా 84 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.. ఇంకా..
2,85,350 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 285.35 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేశామని తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను..
షాపులున్న 1,46,103 మంది టైలర్లుకు రూ. 146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్ల సాయం అందిస్తున్నామని తెలిపారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద సాయం అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు.
లక్షా 20 వేల శాశ్వత ఉద్యోగాలు..
ఈ ప్రభుత్వం వచ్చాక లక్షా 20 వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిచ్చామని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవులను 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చామని తెలిపారు. 58 శాతం నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వార్గాలకే ఇచ్చామని సీఎం అన్నారు. 51 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక లక్షా 84 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇబ్బంది ఉండొద్దని కార్పొరేషన్ ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వంపై రూ.3600 కోట్ల భారం పడినప్పటికీ విలీనం చేశామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆశావర్కర్లకు రూ.3000 జీతమని, తమ ప్రభుత్వం వచ్చాక ఆశావర్కర్లకు జీతం రూ.పదివేలకు పెంచామని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో..
ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తున్న రూ.285.35 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.583.78 కోట్లు. లంచాలకు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా నుంచి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపికచేశారు. పాత అప్పులకు జమచేసుకోలేని విధంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.