Skip to main content

Russia-Ukraine Crisis: అగ్రరాజ్యాలు మధ్య మరో దీర్ఘకాల పోరాటానికి ప్రధానాంశం

Russia and Ukraine Flags

ఉక్రెయిన్‌ వ్యవహారంలో రోజు రోజుకూ ఉద్రిక్తత పెరుగుతోంది. ఆ దేశం నుంచి విడివడి, తిరుగు బాటుదార్ల ఆధిపత్యంలో ఉన్న డాన్‌బాస్‌ ప్రాంతంలోని రెండు స్వయంప్రకటివేర్పాటువాద రిపబ్లిక్‌లను రష్యా గుర్తించింది. పార్లమెంట్‌ వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫిబ్రవరి 22న తీసుకున్న ఈ నిర్ణయం కథలో కొత్త మలుపు. ఉక్రెయిన్‌ సమగ్రత, సార్వభౌమాధికారాలను దెబ్బ తీసే ఈ చర్య ద్వారా పూర్తి స్థాయి దురాక్రమణకు రష్యా సిద్ధమవుతోందనే భావన ప్రబలుతోంది. ఫలితంగా మాస్కోపై వివిధ దేశాల ఆంక్షల పర్వమూ ఫిబ్రవరి 22న మొదలైంది. యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తెచ్చేందుకు భారత్‌ ప్రత్యేక విమాన సర్వీసులు మొదలుపెట్టింది. వెరసి, ఉక్రెయిన్‌ సంక్షోభం చివరకు అగ్రరాజ్యాలు అమెరికా – రష్యాల మధ్య మరో దీర్ఘకాల పోరాటానికి ప్రధానాంశమయ్యేలా ఉంది.  
 
ఉక్రెయిన్‌లో 30 శాతం ఉండే డాన్‌బాస్‌ ప్రాంతంలోని రెండు రిపబ్లిక్‌లూ 2014 మార్చి నుంచి వివాదాస్పదమే. అప్పట్లో రష్యా దాడి చేసి, క్రిమియన్‌ ద్వీపకల్పాన్ని తనలో కలుపుకొంది. రష్యా అండ ఉన్న డాన్‌బాస్‌ ప్రాంత వేర్పాటువాదులు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్య్రం కోరుతూ అదే ఏప్రిల్‌లో రిఫరెండమ్‌ పెట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని తిరుగుబాటుదారు లకూ, ఉక్రేనియన్‌ సేనలకూ మధ్య చిన్నపాటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 14 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 15 లక్షల మంది దేశంలోనే అంతర్గత నిరాశ్రయులయ్యారు. యుద్ధ విరమణ, రాజకీయ పరిష్కారానికి ఉక్రెయిన్‌తో 2014–15ల్లో కుదుర్చుకున్న మిన్‌స్క్‌ ఒప్పందాలను పక్కనపెట్టి, రష్యా ఆ రిపబ్లిక్‌ల స్వాతంత్య్రాన్ని గుర్తించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.

‘నాటో’లో ప్రవేశంతో పాశ్చాత్య ప్రపంచానికి ఉక్రెయిన్‌ దగ్గర కారాదని పట్టుదల మీద ఉన్న రష్యా ప్రవర్తనను ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశం తప్పుబట్టింది. తాజా పరిణామా లపై జర్మనీ తక్షణమే స్పందించింది. రష్యాతో ‘నోర్డ్‌స్ట్రోమ్‌2’ గ్యాస్‌ పైప్‌లైన్‌కు ఇచ్చిన అనుమతు లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆఖరి వరకు దౌత్య మార్గంలో పరిష్కారానికి ప్రయత్నిస్తామంటూనే, అయిదు రష్యన్‌ బ్యాంకుల పైనా, పుతిన్‌ సన్నిహితుడితో సహా కొందరు ప్రముఖ వ్యక్తుల పైనా తొలి విడత ఆంక్షలు ప్రకటించారు. అమెరికా సైతం కొద్ది గంటల్లో ఆంక్షలు ప్రకటించనుంది. యూరోపియన్‌ యూనియన్‌ విదేశాంగ మంత్రులు సమావేశమై, రష్యాపై విధించాల్సిన ఆంక్షలను చర్చించనున్నారు. వరుస చూస్తుంటే, రష్యాకు ఆంక్షల సెగ బాగానే తగిలేలా ఉంది. కానీ, ముడి చమురు కోసం రష్యాపై ప్రధానంగా ఆధారపడాల్సిన అగత్యం ఐరోపాది. ఐరోపా ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 50 శాతం రష్యా నుంచి వచ్చేవే. కాబట్టి, రష్యా పట్ల ఐరోపా అతి కఠినంగా ఉండడం అంత సులభమేమీ కాదు.  

అసలు పుతిన్‌ ఇంత దూకుడు దేనికి ప్రదర్శిస్తున్నారని ఆలోచించాల్సిన విషయం. 1991 డిసెంబర్‌లో విచ్ఛిన్నమైన మునుపటి సోవియట్‌ యూనియన్‌ను పునఃస్థాపించాలన్నది పుతిన్‌ అంతరంగమని విశ్లేషకుల మాట. అందుకు తగ్గట్టే, తూర్పు ఉక్రెయిన్‌లో తాము అండగా నిలిచిన రెండు వేర్పాటువాద ప్రాంతాలకు రష్యన్‌ సేనలను పంపి, ఆ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించి, మొత్తంగా ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారాన్నే సవాలు చేశారాయన. కానీ, ఇంతా చేసి, మునుపటి రష్యన్‌ సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించాలనే యోచన ఏమీ తమకు లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కయ్యానికి కాలుదువ్వుతూనే, దౌత్య పరిష్కారానికి సిద్ధమనీ పదే పదే అనడం విడ్డూరం. దౌత్యమార్గంలో ఏ ప్రయోజనం దక్కితే రష్యా తన జోరు తగ్గి స్తుందన్నది ఇప్పుడు కీలకం. ఉక్రెయిన్‌ను ‘నాటో’లో చేర్చుకోకూడదనేదే ఆది నుంచీ రష్యా ప్రధాన డిమాండ్‌. ఒకప్పుడు అందరూ అంగీకరించిన ఆ మాటకు భంగం కలిగే పరిస్థితి రావడమే ఇప్పుడు ఇంత దాకా తీసుకువచ్చిందని ఓ వాదన. 

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో లక్షన్నర మంది రష్యన్‌ సైనికులున్నారని అమెరికా, 1945 తర్వాత ఐరోపాను అతి పెద్ద యుద్ధంలోకి రష్యా నెడుతోందని బ్రిటన్‌ ఆరోపిస్తున్న వేళ... భారత్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్‌ పక్షాన నిలిచి చిరకాల మిత్ర దేశం రష్యాను దూరం చేసుకోవడం మన దేశానికి ఇష్టం లేదు. అలాగని రష్యా ధోరణిని సమర్థించి, అమెరికాతో కొత్త మైత్రిని చెడగొట్టుకొనే పరిస్థితి లేదు. అందుకే, సంయమనంతో, సమస్యను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే విశ్వశాంతి వైఖరినే భారత్‌ ప్రదర్శిస్తోంది. శాంతి వచనాలెలా ఉన్నా, తాజా పరిణామాలతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చమురు ధర చుక్కలనంటుతోంది. ఏడెనిమిదేళ్ళుగా ఎన్నడూ లేని రీతిలో 100 డాలర్లను తాకిన ధర ఇంకా‡పైపైకి పాకవచ్చు. ఒకవేళ పాశ్చాత్య దేశాలు ప్రచారంలో పెడుతున్నట్టు పోరు అనివార్యమైతే అది మరీ దుర్భరం. అమెరికా – రష్యా కూటములుగా ప్రపంచ దేశాలు చీలే ప్రచ్ఛన్న యుద్ధం కాలపు పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కరోనా సహా అనేక విపత్తులతో మానవాళి సతమతమవుతున్న వేళ ఇది ఏ రకంగా చూసినా నివారించవలసినదే. అసలు సమస్యలను వదిలేసి, అగ్రరాజ్యాలు అనాలోచితంగా అహంభావ ప్రదర్శనకు దిగితే కష్టం. దాని వల్ల ఆఖరికి నష్టపోయేది అధినేతలు కాదు... అతి సామాన్యులు. ఇప్పుడు కావాల్సిందల్లా – ప్రాంతీయ సామరస్యం, ప్రపంచ సుస్థిరతల శాంతిమంత్రం. అగ్రరాజ్యాలు ఆలకిస్తాయా?

చ‌ద‌వండి: Human Migration >> వాతావరణ మార్పులతో వలసల ముప్పు

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Feb 2022 06:10PM

Photo Stories