Skip to main content

Human Migration: వాతావరణ మార్పులతో వలసల ముప్పు

Migration


మానవుని జీవనం దినదినం సంక్షోభంవైపు ప్రయాణిస్తోంది. చేజేతులా మనిషి పేరాశతో ప్రకృతిని ధ్వంసం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. అనేక రూపాల్లో కాలుష్యం మనిషి బతుకుపై దాడి చేస్తూ ఉండటంతో పుట్టిన నేలను వదిలి జానెడు పొట్టను నింపుకోవడం కోసం దూరదేశాలకు జనం వలసపోతున్నారు. ఇది ఏదో ఒక దేశానికి పరిమితమైన అంశం కాదు. కాకపోతే ఈ వలసలు ఎక్కువగా ఆఫ్రికా నుండే ఉండటం కనిపిస్తోంది. 

ఆఫ్రికాలోని 54 దేశాల నుండి ఐరోపా దేశాలకు వలసలు ఇటీవల కాలంలో వెల్లువెత్తాయి. సముద్రాల మీదుగా సాధారణ పడవల్లో ప్రయాణిస్తూ... ప్రమాదాలకులోనై ప్రతి ఏటా వందలు, వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వేలాది మంది కాందిశీకులు ఒక్కసారిగా అక్ర మంగా ప్రవేశించడం వల్ల ఆయా దేశాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తి ప్రభు త్వాల బడ్జెట్లు తారుమారవుతున్నాయి.

మొజాంబిక్, అంగోలా, ఛాద్, టాంజానియా, కెన్యా, ఇథియోపియా దేశాలలో మంచినీటి కొరత, వ్యవ సాయం కుంటుపడిపోవటం, భూములు కుంగిపోవటం లాంటి సమస్యలు ఎక్కువగా వలసలకు దారి తీస్తున్నాయి. ఈ దేశాలకు ఛాద్‌ సరస్సు ప్రధాన నీటి వనరు. అదిప్పుడు 90 శాతం కుంచించుకుపోయింది. 26 వేల చదరపు కిలోమీటర్ల నుండి 15 వేల చదరపు కిలోమీటర్లకు కుంచించుకు పోయింది. ఫలితంగా దాదాపు కోటి 25 లక్షల మందికి నీరు లభించడం లేదు. 

ఇక తుపానులు, కరవులు, భూసారం కోల్పోటం, కార్చిచ్చు, భారీ మట్టిపెళ్లలు విరిగిపడటం, సముద్రాల నీటి మట్టాలు పెరగడం, భూతాపం మిక్కుటం కావడం లాంటివి వలసలు తప్ప మరో మార్గం లేకుండా చేస్తున్నాయి. ఏడాదికి రెండు కోట్ల మంది 2008–2016 మధ్య వలస వెళ్లారని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. 2050 నాటికి 120 కోట్లమంది వలస వెళతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. సబ్‌సహారా ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, దక్షిణాసియాల నుండే 4 కోట్ల మందికి పైగా వలస వెళ్లే పరిస్థితులున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇవిగాకుండా ఆయా దేశాల్లో యుద్ధాలు వలసలకు దారి తీస్తున్నాయి. అలాగే అనేక దేశాల్లో అంతర్గత వలసలూ పెరిగిపోవటం గమనార్హం. అంతర్గత ఘర్షణలతో ఒక్క మొజాంబిక్‌ నుండే 2020లో 6 లక్షల 70 వేలమంది వలస వెళ్లారు. 

2021లో ప్రపంచంలో వాతావరణ విపత్తులను ఎదుర్కొన్న దేశాలలో భారత్‌  ఏడవ స్థానంలో నిలిచింది. 2008 –2018 మధ్య కాలంలో 253 మిలియన్ల వలసలు జరిగాయి. యుద్ధాల వల్ల జరిగిన వలసల కంటే, వాతావరణ విపత్తుల వల్ల పదిరెట్లు ఎక్కువగా జరిగాయి. దక్షిణాసియాలో 2018లో మొత్తం 3 లక్షల 30 వేలు వలస లుండగా అందులో భారత్‌ నుంచే 2 లక్షల 70 వేలు ఉన్నాయి. తీవ్రమైన రిస్క్‌ ఉన్న 33 దేశాల్లో వంద కోట్లమంది పిల్లలు నివసిస్తున్నారు. ప్రపంచ భూతాపం పెరగడం వల్ల సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. చిన్న, చిన్న దీవులలో వరదలూ వలసలకు కారణమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో... 1951 శరణార్థుల (కాందిశీకులు) అంతర్జాతీయ సదస్సు తీర్మానం ప్రకారం వలసల నివారణకు, శరణార్థుల భద్రతకు ఆయా దేశాలు తక్షణం తగిన చట్టాలు రూపొం దించి అమలు చేయాల్సిఉంది.
  – టి. సమత

చ‌ద‌వండి: ఒమిక్రాన్‌’ అనే వేరియెంట్ అంటే ఏమిటి? దీని కథాకమామిషూ..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Feb 2022 05:58PM

Photo Stories