Caste Discrimination: కులవివక్షను నిషేధించిన సియాటిల్
అగ్ర రాజ్యంలో ఈ చర్య తీసుకున్న తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నేత, ఆర్థికవేత్త క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్థానిక కౌన్సిల్ భారీ మెజారిటీతో ఆమోదించింది. నగర వివక్ష వ్యతిరేక విధానంలో కులాన్ని కూడా జోడిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సావంత్ ‘‘అమెరికాలో కులవివక్షపై పోరాటంలో ఇదో కీలక ముందడుగు. ఇక దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరముంది’’ అని అభిప్రాయపడ్డారు. ఇది చరిత్మాత్మక నిర్ణయమని సియాటిల్ టైమ్స్ వార్తా పత్రిక కొనియాడింది.
‘‘ఈ రోజు కోసం హత్య, అత్యాచార బెదిరింపులెన్నింటినో తట్టుకుంటూ ముందుకు సాగాం. అంతిమంగా ద్వేషంపై ప్రేమ గెలిచింది’’ అని తాజా నిర్ణయం వెనక కీలకంగా వ్యవహరించిన ఈక్వాలిటీ ల్యాబ్స్ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. భారత్‌లో కులవివక్షను 1948లో నిషేధించారు. 1950లో రాజ్యాంగంలో పొందుపరిచారు. 2018 అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం అక్కడ ఉంటున్న భారత సంతతి వ్యక్తుల సంఖ్య 42 లక్షల పై చిలుకే. అమెరికా ఎప్పుడూ కులవ్యవస్థను అధికారికంగా గుర్తించకపోయినా అక్కడి దక్షిణాసియావాసులు ఉన్నత విద్యా సంస్థల్లో, పనిచేసే చోట కులవివక్షను ఎదుర్కొన్న ఉదంతాలెన్నో ఉన్నాయి.