Sri Lanka తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా జూలై 15న ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే వెల్లడించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తన మొదటి కార్యాచరణ 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించడమేనని విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇందుకోసం అతిత్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి, పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ 2015లో 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ వెనుక అప్పట్లో విక్రమసింఘే కీలకంగా వ్యవహరించారు. 2019 నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గొటబయా రాజపక్స ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిని ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని గౌరవ సూచకంగా సంబోధించడాన్ని నిషేధించారు. ప్రెసిన్షియల్ జెండాను సైతం రద్దు చేశారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉండాలన్నారు. అధ్యక్షుడి పేరిట మరో జెండా అక్కర్లేదన్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 20న పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ అబేయవర్దనే తెలియజేశారు. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉందంటూ జూలై 16న పార్లమెంట్‌కు అధికారికంగా సమాచారం అందిస్తారు. శ్రీలంకలో పార్లమెంట్‌లో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుండడం 1978 తర్వాత ఇదే మొదటిసారి.
also read: I2I2: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా.. భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు..
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP