Skip to main content

G20 Agriculture Ministers Meeting: మానవాళి భవిష్యత్తు బాధ్యత మీదే.. జీ20 వ్యవసాయ మంత్రుల సదస్సులో మోదీ

వ్యవసాయ శాఖల మంత్రుల బాధ్యత అర్థవ్యవస్థలో ఒక భాగం నిర్వహణ మాత్రమే కాదని, మానవజాతి భవిష్యత్తుకూ అది విస్తరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
G20 Agriculture Ministers Meeting

హైదరాబాద్‌లో జరుగుతున్న జీ20 వ్యవసాయ శాఖ మంత్రుల సదస్సును ఉద్దేశించి జూన్ 16న‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగం ప్రపంచం మొత్తమ్మీద 250 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని, దక్షిణార్ధ గోళంలో 30 శాతం స్థూల జాతీయోత్పత్తికి, అరవై శాతం ఉద్యోగాలకూ కూడా ఈ రంగమే ఆధారమని ఆయన తెలిపారు. అయితే కోవిడ్, మారిపోతున్న వాతావరణ పరిస్థితులు, రాజకీయాల పుణ్యమా అని ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే భారత్‌ ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీల ఆధారిత వ్యవసాయానికి.. ఇంకోవైపు ప్రకృతి సిద్ధమైన సాగు పద్ధతులకు (నేచురల్‌ ఫార్మింగ్‌) ఏకకాలంలో ప్రోత్సాహమిచ్చేలా విధానాలు రూపొందించిందని తెలిపారు. భారత్‌లో నేచురల్‌ ఫార్మింగ్‌కు ఆదరణ పెరుగుతోందని, కృత్రిమ ఎరువులు, కీటకనాశినులకు బదులుగా మట్టిసారాన్ని పెంచేందుకు, దాని ఆరోగ్యాన్ని కాపాడేందుకు అతితక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. 

Edible Oil: కేంద్రం కీల‌క‌ నిర్ణయం.. వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు

సేంద్రియ ఎరువులు, చీడపీడల నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. దిగుబడులు పెంచేందుకు దేశీ రైతన్నలు టెక్నాలజీని కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, పొలాల్లో సోలార్‌ పంపుల వినియోగం, పంటల మెరుగైన ఎంపికకు సాయిల్‌ కార్డులను వాడటం, పోషకాలు, ఎరువుల పిచికారీకి, పంట ఆరోగ్యంపై నిఘాకు డ్రోన్లను వాడుతుండటాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ చర్యలన్నీ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మేలైన మార్గమని విశ్వాసం వ్యక్తం చేశారు.  

Wheat To Check Prices: గోధుమ నిల్వలపై పరిమితులు విధించిన కేంద్రం


సిరిధాన్యాలను అలవాటు చేసుకుందాం.. 
సిరిధాన్యాలు సూపర్‌ఫుడ్‌ మాత్రమే కాదని, నీరు, ఎరువుల వాడకం తక్కువగా ఉండటం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచే పంటలు కూడా అని మోదీ పేర్కొన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా సిరిధాన్యాలతో చేసిన అనేక ఆహార పదార్థాలను విదేశీ ప్రతినిధులు రుచి చూసి ఉంటారంటూ.. భవిష్యత్తులో ఈ ధాన్యాలు ప్రపంచ ఆహారం కావాలని ఆకాంక్షించారు. వేల ఏళ్లుగా సాగులో ఉన్న సిరిధాన్యాలు మార్కెటింగ్‌ గిమ్మిక్కుల ఫలితంగా విలువను కోల్పోయాయని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. సిరిధాన్యాల సాగులో ఉత్తమ విధానాలు, పరిశోధనలు, టెక్నాలజీల అభివృద్ధికి భారత్‌ ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌’ను అభివృద్ధి చేస్తోందని, ఇది అత్యున్నత నైపుణ్య కేంద్రంగా అవతరించనుందని చెప్పారు. ఆహార భద్రత కోసం ప్రపంచమంతా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 

Kharif Crops : రైతుకు మరింత దన్ను.. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలే పరమావధిగా, సుస్థిరమైన, అందరినీ కలుపుకుని పోయే ఆహార వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పటిష్టమైన ఎరువుల పంపిణీ వ్యవస్థ ఏర్పాటూ జరగాలని కోరారు. రైతులకు డిజిటల్‌ టెక్నాలజీలు అందుబాటులోకి తేవాలని, చిన్న, సన్నకారు రైతులకూ వ్యవసాయ సమస్యల పరిష్కారాలు చౌకగా అందుబాటులోకి వచ్చేలా ఉండాలని సూచించారు. ‘వ్యవసాయంలో భారత్‌ దృష్టి, ప్రాధాన్యం రెండూ.. భూమి (వన్‌ ఎర్త్‌)కి సాంత్వన చేకూర్చడం, వసుదైక కుటుంబంలో (వన్‌ ఫ్యామిలీ)లో సామరస్యం తీసుకురావడం ద్వారా భవిష్యత్తు (వన్‌ ఫ్యూచర్‌)ను ప్రకాశవంతం చేయడం’ అని ప్రధాని స్పష్టం చేశారు. 

Egg Production: దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం.. మొదటి స్థానాల్లో ఉన్న 5 రాష్ట్రాలవే..

Published date : 17 Jun 2023 01:44PM

Photo Stories