G20 Meet: వారణాసిలో ‘జీ20’ డెవలప్‌మెంట్ మంత్రుల సదస్సు
డేటాను అందించడంలో అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 12న వారణాసిలో జరిగిన జీ20 దేశాల డెవలప్‌మెంట్ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్‌లో డిజిటలీకరణ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని, ఈ రంగంలో తమ అనుభవాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అవసరంలో ఉన్నవారికి రుణాలు సులభంగా లభించేలా ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు రావాలని ఆకాంక్షించారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల సమర్థ కేటాయింపునకు, ప్రజలకు పాలనాపరమైన సేవలు మెరుగ్గా అందించడానికి అత్యంత నాణ్యమైన డేటా అవసరమని వివరించారు. ప్రజా సాధికారతకు, డేటాను ప్రజలకు అందించడానికి టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటున్నామని వెల్లడించారు. నగరాలు, పట్టణాలే కాదు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సైతం నాణ్యమైన డేటాను అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Kharif Crops : రైతుకు మరింత దన్ను.. 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
అభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధిలో వెనుకంజ వేశాయని మోదీ గుర్తుచేశారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం మన బాధ్యత అని సూచించారు. మన ప్రయత్నాలనీ పారదర్శకంగా, సమగ్రంగా ఉండాలన్నారు. అభివృద్ధి లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెంచాలని చెప్పారు. చాలా దేశాలు అప్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి మార్గాలు కనిపెట్టాలని పిలుపునిచ్చారు. భారత్‌లో వందకుపైగా లక్ష్యిత జిల్లాల్లో ప్రజల జీవనాన్ని మరింత మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టామని ప్రధానమంత్రి వివరించారు.
ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అవి ఇప్పుడు అభివృద్ధి ఉత్ప్రేరకాలుగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ డెవలప్‌మెంట్ మోడల్‌ను అధ్యయనం చేయాలని జీ20 దేశాల మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు. ప్రకృతిని ఆరాధించడం భారత్‌లో ఒక సంప్రదాయంగా వస్తోందన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేవారు. తమ దేశంలో మహిళా సాధికారతకు ఎలాంటి పరిమితులు లేవన్నారు. సమాజంలో మార్పునకు, ప్రగతికి మహిళలే సారథులని తేల్చిచెప్పారు. అభివృద్ధి ఎజెండాను వారే నిర్దేశిస్తారని అన్నారు.
Egg Production: దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం.. మొదటి స్థానాల్లో ఉన్న 5 రాష్ట్రాలవే..
కాశీని సందర్శించండి
ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి భారత్‌లో వారణాసి అత్యంత పురాతన నగరమని ప్రధాని మోదీ తెలియజేశారు. విజ్ఞానానికి, చర్చకు, సంవాదానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు వారణాసి కొన్ని శతాబ్దాలుగా ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందుతోందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజల కలయికకు ఇదొక కూడలి అని చెప్పారు. భారత్‌లోని భిన్నమైన సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ చూడొచ్చని అన్నారు. సదస్సు జరిగే గదులకే పరిమితం కాకుండా కాశీ నగరాన్ని సందర్శించాలని, కాశీ స్ఫూర్తిని అనుభూతి చెందాలని జీ20 దేశాల మంత్రులకు మోదీ విజ్ఞప్తి చేశారు. గంగా హారతిని, సారనాథ్‌ను తిలకిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించే ప్రేరణ కచ్చితంగా లభిస్తుందని తెలిపారు. వారణాసి తన సొంత నియోజకవర్గమని తాను ఈ మాట చెప్పడం లేదని మోదీ వ్యాఖ్యానించారు.