Skip to main content

North Korea: చుక్కలు చూపిస్తున్న‌ సరుకుల ధరలు.. కిలో బియ్యం రూ.220

పైన పటారం, లోన లొటారం అన్నట్టుగా తయారైంది ఉత్తర కొరియా పరిస్థితి. అధ్యక్షుడు కిమ్‌ వరుస క్షిపణి పరీక్షలతో దాయాది దక్షిణ కొరియాకు, దాని మద్దతుదారు అమెరికాకు సవాళ్లు విసురుతుంటే దేశం మాత్రం కనీవినీ ఎరుగని కరువు కోరల్లో చిక్కి అల్లాడుతోంది. తిండికి లేక జనం అలమటిస్తున్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగకుంటే 1990ల్లో దేశం చవిచూసిన 20 లక్షల పై చిలుకు ఆకలి చావుల రికార్డు చెరిగిపోయేందుకు ఎంతోకాలం పట్టదంటూ ఆందోళన వ్యక్తమవుతోంది..!
food shortage in North Korea

అటు కాలం కనికరించడం లేదు. తీవ్ర వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో గతేడాది పంట దిగుబడులు కుదేలయ్యాయి. ఇటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంతో ఇంతో ఆదుకుంటూ వచ్చిన ప్రజా పంపిణీ వ్యవస్థ చేతులెత్తేసింది. ఇంతకాలం మార్కెట్లో దొరుకుతూ వచ్చిన చైనా తిండి గింజలు, నిత్యావసరాలు కరోనా కట్టడి దెబ్బకు మూడేళ్లుగా అసలే అందుబాటులో లేకుండా పోయాయి. దాంతో ఉత్తర కొరియా అక్షరాలా ఆకలి కేకలు పెడుతోంది. జనాభాలో అధిక శాతం రోజుకు ఒక్క పూట కూడా తిండికి లేక అలమటిస్తున్నారు. నియంతృత్వపు ఇనుప తెరలు దాటుకుని ఏ విషయమూ బయటికి రాదు గనుక అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. కానీ ఇప్పటికే లక్షలాది మంది కరువు బారిన పడ్డట్టు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరువు మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్నట్టు చె బుతున్నాయి. అస్తవ్యస్త పాలనకు మారుపేరైన కిమ్‌ ప్రభుత్వమే ఇందుకు ప్రధాన దోషిగా కనిపిస్తోంది.

Ukraine-Russia Conflict: ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో కలిసి పని చేస్తాం

 
కారణాలెన్నో.. 
☛ కొరియా కరువుకు చాలా కారణాలున్నాయి. కరోనా దెబ్బకు ఆహార కొరత తీవ్రతరమైంది. 
☛ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలను విధించి అత్యంత కఠినంగా అమలు చేయడం, సరిహద్దులను పూర్తిగా మూసేయడంతో సమస్య మరింత పెరిగింది. 2.5 కోట్ల జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి కనీసం 55 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం. కాగా వార్షిక సగటు ఉత్పత్తి 45 లక్షల టన్నులే. మిగతా 10 శాతం లోటు చాలావరకు చైనాతో సాగే అనధికారిక వర్తకం ద్వారా పూడేది. తిండి గింజలు, నిత్యావసరాలతో పాటు పలు ఇతర చైనా సరుకులు 2020 దాకా దేశంలోకి భారీగా వచ్చేవి. ముఖ్యంగా గ్రామీణుల అవసరాలు చాలావరకు వీటిద్వారానే తీరేవి. కానీ మూడేళ్లుగా ఆంక్షల దెబ్బకు ఈ వర్తకం దాదాపుగా పడకేసింది. ఇది సగటు కొరియన్లకు చావుదెబ్బగా మారింది. దీనికి తోడు గతేడాది తిండి గింజల ఉత్పత్తి 35 లక్షల టన్నులకు మించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. 
☛ ప్రభుత్వం వద్ద భారీగా ఆహార నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే చైనా నుంచి భారీగా బియ్యం, గోధుమ పిండి తదితరాలను దిగుమతి చేసుకుంది కూడా. కానీ ‘ముందుజాగ్రత్త’ చర్యల్లో భాగంగా వాటిని కావాలనే దాచి ఉంచిందని పరిశీలకులు చెబుతున్నారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రజల్లో చాలామందికి కొనుగోలు శక్తి క్షీణించడంతో వారికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. కిలో బియ్యం ధర ఏకంగా 220 రూపాయలకు ఎగబాకిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! 
☛ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చి దేశాన్ని స్వయంసమృద్ధంగా మార్చుకుంటామంటూ తాజాగా జరిగిన 4 రోజుల వర్కర్స్‌ పార్టీ సమావేశాల్లో కిమ్‌ గంభీరంగా ఉపన్యాసమిచ్చారు. అది ఏ మేరకు వాస్తవ రూపు దాలుస్తుందన్న దానిపైనే కొరియన్ల భవితవ్యం ఆధారపడుతుంది. 

Pakistan Economic Crisis: సంక్షోభంలో పాక్‌.. మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్‌ హాళ్లు త్వరగా మూసేయాలని ఆదేశం

తీవ్ర అసమానతలు 
☛ ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల జాబితాలో ఉంది. ప్రజల తలసరి ఆదాయం కేవలం రూ.1.3 లక్షలు! 
☛ దేశంలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ. 
☛ అత్యధికులకు, ముఖ్యంగా గ్రామీణులకు అన్నం, కాయగూరలే ప్రధానాహారం. 
☛ మాంసాహారం, పండ్లు వారికి అందని ద్రాక్షే. 
☛ పట్టణాల్లో పరిస్థితి కాస్త మెరుగు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో స్థోమత ఉంటే అన్నిరకాల ఆహారమూ దొరుకుతుంది. 
☛ దేశంలో ప్రైవేట్‌లో ఆహారం, ఆహార ధాన్యాల అమ్మకం నిషిద్ధం. కానీ కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దాంతో ప్రైవేట్‌ క్రయ విక్రయాలను ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతోంది. 

US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో.. ట్రంప్‌కి పోటీగా ఆయ‌న‌ వీరవిధేయులే!

ఆ కరువుకు 20 లక్షల మంది బలి! 
1990ల్లో ఉత్తర కొరియా చవిచూసిన భయానక కరువు గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పకుంటారు. ‘ఆర్డియస్‌ మార్చ్‌’గా పిలిచే ఈ కరువుకు అస్తవ్యస్త పాలన, సోవియట్‌ నుంచి సాయం ఆగిపోవడంతో పాటు 1995లో వచి్చన భారీ వరదలు తక్షణ కారణంగా మారాయి. వాటి దెబ్బకు దేశంలో వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో వంతుకు పైగా పొలాలు రోజల తరబడి అడుగుల లోతు నీటిలో మునిగిపోయాయి! జనమంతా పనీపాటా వదిలేసి కేవలం తిండి గింజల కోసం రోజుల తరబడి పొలాల వెంబడి తిరుగుతూ అలమటించిన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. కనీవినీ ఎరగని ఆ కరువుకు రెండు కోట్ల జనాభాలో పదో వంతుకు పైగా, అంటే 20 లక్షల మందికి పైగా బలైనట్టు చెబుతారు. అంతేగాక ఏకంగా 62 శాతం మందికి పైగా చిన్నారులు పౌష్ఠికాహార లోపానికి గురై శాశ్వత ఆరోగ్య తదితర సమస్యల బారిన పడ్డారు. రెండు మూడేళ్ల తర్వాత పరిస్థితి అదుపులోకి వచి్చనా చిన్నారులు మాత్రం కోలుకోలేకపోయారు. నేటికీ ఉత్తర కొరియాలో 22 శాతం మంది బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్టు అంచనా!  
నిధులన్నీ సైన్యానికే! 
☛ ఉత్తర కొరియా 12 లక్షల మందితో కూడిన ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద సైన్యాన్ని పోషిస్తోంది. 
☛ ఏటా జీడీపీలో ఏకంగా నాలుగో వంతు సైన్యంపైనే వెచ్చిస్తోంది. 
☛ 2022లోనైతే దేశ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు 70 ఖండాంతర, క్రూయిజ్‌ క్షిపణులను పరీక్షించింది! 
☛ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇటీవలే భారీ సంఖ్యలో ఖండాంతర క్షిపణులు తదితరాలతో నెల రోజుల క్రితమే అతి పెద్ద సైనిక పరేడ్‌ను నిర్వహించింది! 
☛ ఇలా వనరులన్నీ రక్షణ రంగానికే మళ్లుతుండటంతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. 
☛ కిమ్‌ అణు పరీక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు విధించిన ఆంక్షలతో పరిస్థితి మరింత విషమించింది. 
☛ కేవలం గతేడాది క్షిపణి పరీక్షలకు వెచ్చించిన నిధులతో దేశ జనాభా మొత్తానికీ ఏడాది పాటు చాలినన్ని తిండి గింజలు అందించవచ్చని అంచనా.

Indian American: యూట్యూబ్ కొత్త సీఈఓగా భారతీయుడు.. ఆయ‌నకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విషయాలు 

Published date : 06 Mar 2023 05:35PM

Photo Stories