Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. గాఢనిద్రలోనే సమాధి.. 600లకి పైగా మృతి
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. భూ ప్రకంపనల ప్రభావం యూరప్‌లో గ్రీస్, మిడిల్ ఈస్ట్‌లో సిరియా, లెబనాన్ వరకూ కంపించింది. మృతుల సంఖ్య వందకు పైనే దాటింది. తాజా సమాచారం ప్రకారం.. 600 మందికి పైగా మృతి చెందారు. స్వల్ప వ్యవధిలో భారీగా రెండుసార్లు భూమి కంపించడం.. ఆ ప్రభావంతో పలు బహుళంతస్థుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సిరియాలో 245 మంది పైగా, టర్కీలో 284 మంది పైగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
గాఢనిద్రలోనే సమాధి..
అర్ధరాత్రి అంతా గాడనిధ్రలో ఉండగా భూకంపం సంభవించింది. దీంతో చాలామంది శిథిలాల కిందే సమాధి అయినట్లు భావిస్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారత కాలమానం ప్రకారం.. ఫిబ్రవరి 6వ తేదీ (సోమవారం) తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోగ్రాఫికల్ సర్వీస్ వెల్లడించింది. ఆపై పావుగంటకు 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.
తుర్కియే గజియాన్టెప్ ప్రాంతంలో 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. సిరియాకు సరిహద్దుగా ఉండే గజియాన్టెప్ ప్రాంతం.. తుర్కియేకి ప్రధానమైన పారిశ్రామిక కేంద్రం కూడా. భూకంపం ప్రభావంతో.. లెబనాన్, ఈజిప్ట్, సైప్రస్‌లోనూ ప్రకంపలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ మూడు చోట్ల నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక భూకంపం తర్వాత తుర్కియేలోని కహ్రామన్మరాస్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
తరచూ భూకంపాలు..
తుర్కియేలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. ఇక, 1999లో టర్కీ చరిత్రలో అత్యంత భీకర ప్రకృతి బీభత్సాన్ని చవిచూసింది. ఆ ఏడాది 7.4 తీవ్రతతో భూకంపం సంభించి 17 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇస్తాంబుల్‌లోనే 1000 మంది మరణించారు.
Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu
— Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023