Haibatullah Akhunzada: అఫ్గాన్ అత్యున్నత నాయకుడిగా ఎంపికైన మత గురువు?
ఇందులో భాగంగా... దేశ అత్యున్నత నాయకుడిగా(సుప్రీం లీడర్) తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా(60)ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తాలిబన్ సమాచార, సాంస్కృతిక కమిషన్ సీనియర్ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ సెప్టెంబర్ 2న వెల్లడించారు. కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్‌చార్జులుగా ఉంటారని తెలిపారు. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని వివరించారు.
సుప్రీం లీడర్‌దే పెత్తనం...
అఫ్గానిస్తాన్‌లో ఇరాన్ తరహా ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇరాన్‌లో సుప్రీం లీడర్‌దే పెత్తనం. దేశంలో ఇదే అత్యున్నత రాజకీయ, మతపరమైన, సైనికపరమైన పదవి. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైనిక, ప్రభుత్వ, న్యాయ విభాగం అధినేతల నియామకంలో సుప్రీం లీడర్ మాటే చెల్లుబాటు అవుతుంది. సుప్రీం లీడర్‌కు లోబడి అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు.
కాందహార్ నుంచే పరిపాలన...
అఫ్గాన్ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలు, గిరిజన తెగలతో సహా దేశంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం దక్కుతుందని ఖతార్ రాజధాని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ ప్రకటించారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గాన్ అత్యున్నత నాయకుడిగా ఎంపికైన మత గురువు?
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ముల్లా హైబతుల్లా అఖుంద్‌జాదా
ఎందుకు : అఫ్గానిస్తాన్ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా...