Social Media Ban: పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణకు చట్టాలు చేస్తున్న దేశాలు ఇవే..
ఇటీవల ఆ్రస్టేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించింది. అయినా ఆ్రస్టేలియా తరహాలోనే పలు దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు, మైనర్లపై నిషేధం వంటి విధానాల ద్వారా సోషల్ మీడియాను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నించాయి.
ఆయ దేశాల వివరాలు, అవి చేస్తున్న ప్రయత్నాలు ఇక్కడ చూద్దాం.
ఆ్రస్టేలియా
సోషల్ మీడియా మినిమమ్ ఏజ్ బిల్లు ప్రకారం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ యజమాని మెటా నుంచి టిక్‌టాక్ వరకు మైనర్లు లాగిన్ కాకుండా నిరోధించాలని బిల్లు తీసుకొచ్చింది. వీటి అమలును ఉల్లంఘిస్తే 32 మిలియన్ డాలర్ల వరకు జరిమానాలు విధించనుంది. ఏడాదిలో ఈ నిషేధం అమల్లోకి రానుంది. జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్ ప్రారంభమవుతుంది.
స్పెయిన్
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును స్పెయిన్ జూన్‌లో ప్రవేశపెట్టింది. దీని అమలు, వయస్సు ధ్రువీకరణ వంటివాటిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సింది ఉంది.
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. ఎక్కడంటే..
దక్షిణ కొరియా
ఈ దేశం 2011లోనే సిడ్రెల్లా చట్టం రూపొందించింది. దీని ప్రకారం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌గేమ్స్ ఆడకూడదు. ఒక దశాబ్దం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ‘చాయిస్ పర్మిట్’వ్యవస్థను ఏర్పాటు చేసింది. వారి పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చింది.
అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించారు. దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ‘సిండ్రెల్లా’చట్టం మాదిరిగా యువతను నియంత్రించే వివక్షాపూరిత ప్రయత్నమని విమర్శిస్తున్నాయి.
ఫ్రాన్స్
గత ఏడాదే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల వయస్సును ధ్రువీకరించాలని, 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి తల్లిదండ్రుల అనుమతిని పొందాలని ఫ్రాన్స్ 2023 జూన్‌లో చట్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సోషల్ నెట్‌వర్క్‌కు ప్రపంచ ఆదాయంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ఈయూ చట్టానికి అనుగుణంగా ఉందని యూరోపియన్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అమలులోకి రాలేదు.
Elon Musk: భవిష్యత్తులో యుద్ధాలన్నీ డ్రోన్లతోనే.. ఎలాన్ మస్క్
ఇటలీ
ఇక్కడ 14 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఆపై వయసున్న వారిపై ఎలాంటి నిషేధాలు లేవు. ఎవరి సమ్మతీ అవసరం లేదు.
జర్మనీ
ఈ దేశ నిబంధనల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలి. ఈ నియంత్రణలు సరిపోవని, ప్రస్తుత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికంటే ముందుకెళ్లే ఉద్దేశంలో ఆ దేశం లేదు.
బెల్జియం
13 ఏళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలని, అది తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలని 2018లో బెల్జియం చట్టం చేసింది.
నార్వే
ఇక నార్వేలో సోషల్ నెట్‌వర్క్‌లకు ఉపయోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు. అయినా 12 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ మంది, తొమ్మిదేళ్ల పిల్లల్లో సగానికిపైగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కనీస వయోపరిమితిని 15 సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల అమలులో విఫలమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలను అన్వేషిస్తోంది.
నెదర్లాండ్స్
ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించడానికి వయో పరిమితి లేదు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అక్కడి ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్ పరికరాలను నిషేధించింది. ఇది 2024 జనవరి నుంచి అమల్లో ఉంది. అయితే డిజిటల్ పాఠాలకు, వైద్య అవసరాలు, వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపులు వర్తిస్తాయి.
World Oldest Alphabet: ప్రపంచంలో తొలి వర్ణమాలను కనుగొన్న శాస్త్రవేత్తలు!
చైనా
2021 నుంచి మైనర్లకు యాక్సెస్ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా ఇందుకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిరోధించడం ఇక్కడ సులభం.
టిక్‌టాక్ వంటి చైనీస్ డౌయిన్‌లో 14 ఏళ్లలోపు వినియోగదారులకు పరిమితి ఉంది. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది. పిల్లలు అంతకంటే ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటానికి కూడా అనుమతి లేదు.