Countries of Europe: రష్యా చమురుపై ఈయూ నిషేధం
రష్యాపై ఆంక్షలకు కొనసాగింపుగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆర్నెల్లలో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు ఈయూ దేశాలన్నీ అంగీకరించాయి. ఇటీవల జరిగిన ఈయూ కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర సరఫరా మార్గాలను వెతుక్కోవడం, వీలైనంత త్వరగా సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం తదితరాల ద్వారా కొరతను అధిగమించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. హంగేరి వంటి మధ్య, తూర్పు యూరప్ దేశాలకు పైప్‌లైన్ ద్వారా జరుగుతున్న సరఫరాలు మాత్రం కొనసాగుతాయి. యూరప్ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్ అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యాపైనే ఆధారపడి ఉంది. అందుకే ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచీ ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా.. చాలా యూరప్ దేశాలు సమ్మతించలేదు.