Digital Rupee: డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయి
తొలి దశలో డిసెంబర్ 1 నుంచి∙4 నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ నవంబర్ 29న తెలిపింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ ఈ జాబితాలో ఉన్నాయి. వీటి తర్వాత హైదరాబాద్‌తో పాటు మరో తొమ్మిది నగరాల్లో ఈ–రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ముందుగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో, పరిమిత స్థాయిలో యూజర్లకు దీన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. బ్యాంకుల మధ్య టోకు లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఈ–రూపీని తొలిసారిగా నవంబర్ 1న ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిది. ‘ఇది చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. పేపర్ కరెన్సీ, నాణేల డినామినేషన్‌లో మధ్యవర్తి సంస్థల (బ్యాంకుల) ద్వారా పంపిణీ అవుతాయి‘ అని ఆర్‌బీఐ పేర్కొంది. యూజర్లు తమ మొబైల్స్, డివైజ్‌లలో డిజిటల్ వాలెట్ల ద్వారా డిజిటల్ రూపీ ని భద్రపర్చుకోవచ్చని, ఆ వాలెట్ల ద్వారా చెల్లింపు లావాదేవీలను నిర్వహించవచ్చని పేర్కొంది.