Skip to main content

RBI Governor Shaktikanta Das: ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం.. శక్తికాంత దాస్‌

ఆర్థిక వ్యవస్థపై రూ.2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు.

చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ.3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు మే 22న తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్‌.. డిపాజిట్‌ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్‌ చెప్పారు. ఇక రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు.  

పుష్కలంగా నిధులు..
ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్‌ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్‌ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్‌ చెప్పారు.

Mahila Samman Scheme: పూర్తి వివరాలు.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, వడ్డీ రేటు

ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు..
వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్‌ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్‌ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్‌ చేస్తే పాన్‌ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు.

ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్‌ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్‌ తెలిపారు.

'క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!

అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను
ప్రస్తుతం రూ.2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్‌ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్‌ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్‌ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్‌ వ్యాఖ్యానించారు.

నోట్ల మార్పిడికి, బ్యాంక్‌ ఖాతాల్లో డిపాజిట్‌ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్‌ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్‌ వివరించారు.

The Wealth Report 2023: దేశంలో త‌గ్గిన అత్యంత సంపన్నులు..!

నీరు, నీడ కల్పించండి..
రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్‌ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్‌లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్‌బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

పీఎస్‌బీ చీఫ్‌లతో భేటీ..
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ మే 22న‌ సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

Published date : 23 May 2023 12:02PM

Photo Stories