Skip to main content

Narendra Modi: ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పనిచేయాలి.. మోదీ

ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలసికట్టుగా పనిచేయాలని, అంతర్జాతీయంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో తమ పరిధి దాటి విశాల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను సొంతం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రముఖ ఆర్థికవేత్తలతో జ‌న‌వ‌రి 13న‌ ప్రధాని సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. డిజిటల్‌ కార్యకలాపాల విషయంలో, ఫిన్‌టెక్‌ విస్తరణలో దేశం సాధించిన విజయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించినట్టు అధికారికంగా ఓ ప్రకటన విడుదలైంది. సమ్మిళిత వృద్ధికి ఇది కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత్‌ వృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ, ఉత్పాదకతలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలని కోరారు. రిస్క్‌లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా డిజిటైజేషన్, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం రంగాల్లో విస్తతమైన అవకాశాలున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. 

Global Investors Summit: పెట్టుబడులకు ఆకర్శణీమైన గమ్యస్థానంగా భారత్‌.. మోదీ

ఈ అవకాశాలను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్‌ తన వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆర్థికవేత్తలు ఈ సమావేశంలో ప్రధానికి సూచించినట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యలు కొనసాగుతాయంటూ, భారత్‌ మరింత బలమైన వృద్ధిని నమోదు చేసేందుకు చర్యలను ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బెరీ, ఉన్నతాధికారులతోపాటు.. ఆర్థికవేత్తలు శంకర్‌ ఆచార్య, అశోక్‌ గులాటీ, షమిక రవి తదితరులు పాల్గొన్నారు.  

National Youth Festival: హుబ్బళ్లిలో నేషనల్‌ యూత్‌ ఫెస్టివల్‌

Published date : 14 Jan 2023 01:09PM

Photo Stories