Skip to main content

Top 10 Billionaires: అంబానీ.. టాప్‌–10 సంపన్నుల్లో ఏకైక భారతీయుడు.. 23వ స్థానంలో అదానీ

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వ్యవహారంతో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ సంపద భారీగా కరిగిపోవడంతో.. అంతర్జాతీయంగా టాప్‌ 10 కుబేరుల్లో భారత్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఒక్కరే చోటు ద‌క్కించుకున్నారు.
Mukesh Ambani

82 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా 53 బిలియన్‌ డాలర్ల సంపదతో అదానీ 23వ స్థానానికి పరిమితమయ్యారు. డాలర్ల మారకంలో సంపదను లెక్కిస్తూ రీసెర్చ్‌ సంస్థ హురున్, రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌ ఎం3ఎం కలిసి రూపొందించిన ’2023 గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ మూడోసారి టైటిల్‌ నిలబెట్టుకున్నారు. వ్యాపారవేత్తల దృష్టికోణం నుంచి ప్రస్తుత ప్రపంచ ఎకానమీ పరిస్థితులను ఆవిష్కరించేలా ఈ జాబితా ఉందని హురున్‌ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్‌ జునైద్‌ తెలిపారు.  

Reliance Industries: విలువలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నంబర్‌వ‌న్‌


క్షీణతలో బెజోస్‌ టాప్‌.. 
ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. అత్యధికంగా సంపద పోగొట్టుకున్న వారి లిస్టులో టాప్‌లో నిల్చారు. ఆయన సంపద 70 బిలియన్‌ డాలర్లు పడిపోయి 118 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. అంబానీ, అదానీ కలిసి పోగొట్టుకున్న సంపద కన్నా ఇది ఎక్కువ కావడం గమనార్హం. హురున్‌ రిపోర్ట్‌ ప్రకారం ఇలా భారీగా పోగొట్టుకున్న వారి లిస్టులో బెజోస్‌ అగ్రస్థానంలో ఉండగా.. అదానీ 6, అంబానీ 7వ ర్యాంకుల్లో నిల్చారు. 2022–23లో అదానీ సంపద 35 శాతం పడిపోయింది. 28 బిలియన్‌ డాలర్ల మేర (రోజుకు రూ.3,000 కోట్లు చొప్పున) క్షీణించి మార్చి మధ్య నాటికి 53 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. అంబానీ సంపద కూడా క్షీణించినప్పటికీ తగ్గుదల 20 శాతానికే పరిమితమైంది. అదానీ గ్రూప్‌ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల తదనంతర పరిణామాలతో గౌతమ్‌ అదానీ సంపద భారీగా కరిగిపోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని విశేషాలు.. 
☛ 2023 గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో సంపన్నుల సంఖ్య 3,112కు తగ్గింది. గతేడాది ఇది 3,384గా ఉంది. వారి మొత్తం సంపద 10 శాతం తగ్గి 13.7 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైంది. 
☛ గతేడాదితో పోలిస్తే భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 28 తగ్గి 187కి చేరింది. ముంబైలో అత్యధికంగా 66 మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను పరిగణనలోకి తీసుకుంటే బిలియనీర్ల సంఖ్య 217గా ఉంది. మొత్తం కుబేరుల సంపదలో భారత్‌ వాటా 5 శాతంగా ఉంది. కాగా, అమెరికా వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. భారత్‌తో పోలిస్తే చైనాలో బిలియనీర్ల సంఖ్య అయిదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. 
☛ భారత్‌లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్, సర్వీసుల విభాగంలో స్వయంకృషితో బిలియనీరుగా ఎదిగిన వారిలో 4 బిలియన్‌ డాలర్ల సంపదతో రాధా వెంబు రెండో స్థానంలో నిల్చారు. దివంగత ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఈసారి కుబేరుల లిస్టులో స్థానం దక్కించుకున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

టాప్‌ 100లో మనోళ్లు..

పేరు

ర్యాంకు

సంపద (బి.డాలర్లలో)

ముకేశ్అంబానీ

9

82

గౌతమ్అదానీ కుటుంబం

23

53

సైరస్పూనావాలా

46

27

శివ్నాడార్కుటుంబం

50

26

లక్ష్మీ ఎన్మిట్టల్

76

20

ఎస్పీహిందుజా కుటుంబం

76

20

దిలీప్సంఘ్వీ కుటుంబం

98

17

 

Published date : 23 Mar 2023 05:53PM

Photo Stories