Skip to main content

Economic Survey Highlights: భారత ఆర్థిక సర్వే : 2021–22

Economic Survey 2021-22

Economic Survey Highlights: కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్‌.. తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. 2021–22 ఆర్థిక సంవత్సరం 9.2 శాతం, 2022–23 ఆర్థిక సంవత్సరం 8–8.5 శాతం స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. జనవరి 31న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలోని వివరాలు ఇలా..

ఇన్‌ఫ్రాపై 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాలి..
2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్‌ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో .. ఈ వ్యవధిలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. 2008–17 మధ్య కాలంలో ఇన్‌ఫ్రాపై భారత్‌ 1.1 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించింది. భారీ లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రం నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ)ని ఆవిష్కరించింది. 2020–25 మధ్య కాలంలో ఇన్‌ఫ్రాపై 1.5 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించే అంచనాలతో ఇది రూపొందింది. దేశీయంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఇది తోడ్పడనుంది.

ఎయిరిండియా విక్రయంతో ప్రైవేటీకరణకు ఊతం..
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయ వ్యవహారం .. డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు. ఎయిరిండియాను టాటా గ్రూప్‌ దాదాపు రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అదుపులోనే ద్రవ్యోల్బణం..

  • సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంతో పాటు ఇంధనాలపై సుంకాలను తగ్గించడంతో 2021–22 ఆర్థిక ఏడాదిలో ఇప్పటిదాకా ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయి. 
  • వంటనూనెలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల రేట్లు పెరిగిపోయాయి... కానీ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి కొంత మేర కట్టడి చేసింది.
  • ఇంధన ధరలు అధిక స్థాయిల్లో ఉంటున్న నేపథ్యంలో దిగుమతిపరమైన ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకరంగా ఉండవచ్చు.
  • భారత్‌ తన ఇంధన అవసరాల కోసం 85 శాతం పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ రేటు కూడా భారీగా ఎగుస్తుంది.

వర్షపాతం సాధారణమే..
వర్షపాతం సాధారణంగానే ఉంటుంది. అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు లిక్విడిటీ ఉపసంహరణను ఒకేసారి కాకుండా క్రమపద్ధతిలోనే చేయవచ్చు. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి నెలకొంది.. మిగతా దేశాల్లో అధిక వడ్డీ రేట్లు గానీ లభిస్తే భారత్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉన్నాయి.

వ్యవసాయ రంగంలో 3.9 శాతం వృద్ధి..
2021–22 ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతం. ఈ నేపథ్యంలో పంటల్లో వైవిధ్యానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. అలాగే వ్యవసాయ రంగ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలను, సేంద్రియ వ్యవసాయాన్ని పెంచడంతో పాటు డ్రోన్ల వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని కూడా ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలి.

సముద్ర వాణిజ్యం..
పోర్టుల్లో గవర్నెన్స్‌ను మెరుగుపర్చేందుకు, సామర్థ్యాల వినియోగాన్ని .. కనెక్టివిటినీ పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 2014 మార్చి ఆఖరు నాటికి వార్షికంగా 871.52 మిలియన్‌ టన్నులుగా (ఎంటీపీఏ) ఉన్న 13 ప్రధాన పోర్టుల సామర్థ్యం 2021 మార్చి ఆఖరు నాటికి 79 శాతం పెరిగి 1,560.61 ఎంటీపీఏకి చేరింది. షిప్పింగ్‌ కంటెయినర్ల కొరత, వాణిజ్య వ్యయాల పెరుగుదల తదితర అంశాలు భారతీయ సముద్ర వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపాయి.

సింగపూర్‌ టాప్‌లో...

  • ఈక్విటీ పెట్టుబడులు మందకొడిగా ఉండటంతో 2021 ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో స్థూలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమాణం 54.1 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. నికరంగా 24.7 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ విభాగంలోకి అత్యధికంగా 7.1 బిలియన్‌ డాలర్లు వచ్చాయి.
  • భారత ఈక్విటీల్లో అత్యధికంగా ఇన్వెస్ట్‌ చేస్తున్న దేశాల్లో సింగపూర్‌ టాప్‌లో కొనసాగుతోంది. అమెరికా ఆ తర్వాత స్థానంలో ఉంది. 
  • గడిచిన ఏడు ఆర్థిక సంవత్సరాల్లో (2014–21) భారత్‌లోకి 441 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకు ముందు 21 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం 764 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు 58 శాతం.

రైల్వేకు భారీగా కేటాయింపులు..
భవిష్యత్‌ అవసరాలకు సర్వసన్నద్ధంగా ఉండేందుకు, దేశ ఆర్థిక వృద్ధి చోదకంగా నిల్చేందుకు రైల్వేస్‌ను పటిష్టంగా తీర్చిదిద్దాలి. ప్యాసింజర్ల డిమాండ్‌పరంగానే కాకుండా సరకు రవాణాలో ప్రస్తుతం 26–27 శాతంగా ఉన్న రైల్వేస్‌ వాటాను జాతీయ రైల్‌ ప్లాన్‌లో నిర్దేశించుకున్నట్లుగా 40–45 శాతానికి పెంచుకోవాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. 2030 నాటికల్లా డిమాండ్‌కి మించి సామర్థ్యాలను పెంచుకునేందుకు వచ్చే పదేళ్లలో రైల్వే రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు రాగలవని అంచనా.

బ్యాంకుల రుణ వృద్ధి 9.2 శాతం..
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఉన్నప్పటికీ, దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పటిదాకానైతే ఈ సవాలును దీటుగానే ఎదుర్కొంది. 2020–21 ప్రథమార్ధంలో రూ. 14,688 కోట్లుగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం 2021–22 ప్రథమార్ధంలో రూ. 31,144 కోట్లకు పెరిగింది. అలాగే ఇదే వ్యవధిలో ప్రైవేట్‌ బ్యాంకుల లాభాలు రూ. 32,762 కోట్ల నుంచి రూ. 38,234 కోట్లకు పెరిగాయి. 2021 డిసెంబర్‌ ఆఖరుకి బ్యాంకుల రుణ వృద్ధి 9.2 శాతం.

ఏవియేషన్‌కు రెక్కలు..
కోవిడ్‌–19 టీకాల ప్రక్రియ వేగవంతం కావడం, అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు కూడా సడలుతుండటంతో దేశీ విమానయాన రంగం మళ్లీ క్రమంగా పుంజుకుంటోంది. 2013–14లో 6.1 కోట్లుగా ఉన్న దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20 నాటికి 13.7 కోట్ల స్థాయికి పెరిగింది. ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్, విమానాశ్రయాల ప్రైవేటీకరణ.. ఆధునికీకరణ, ప్రాంతీయంగా కనెక్టివిటీని పెంచేందుకు ఉడాన్‌ స్కీమ్‌ ఆవిష్కరణ మొదలైన చర్యలతో కొన్నాళ్లుగా ఏవియేషన్‌ రంగానికి కేంద్రం దన్నుగా నిలిచింది.

సర్వేలో ఇతర ముఖ్యాంశాలు..

  • ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. 2022–23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎకానమీ సర్వసన్నద్ధంగా ఉంది.
  • కరోనా సవాళ్లను అధిగమించేందుకు ఇతర దేశాల తరహాలో ముందస్తుగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కాకుండా భారత్‌ .. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా విధానాలను అమలు చేసింది. డిమాండ్‌ నిర్వహణ కాకుండా సరఫరా వ్యవస్థపరమైన సంస్కరణలతో మహమ్మారి సృష్టించిన సమస్యలను ఎదుర్కొంది.
  • భారీ ఎగుమతుల వృద్ధి, మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న వెసులుబాటు తదితర అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధికి తోడ్పడనున్నాయి.
  • ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉండటంతో ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు కూడా పుంజుకుని ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడగలవు.
  • అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లోటు, రుణ భారాలు భారీగా పెరిగిపోయినప్పటికీ 2021–22లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది.
  • విదేశీ మారకం నిల్వలపరంగా ‘బలహీనమైన అయిదు’ దేశాల్లో ఒకటిగా కొనసాగిన భారత్‌ ప్రస్తుతం అత్యధికంగా ఫారెక్స్‌ నిల్వలున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎదిగింది. దీంతో విధానపరంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు లభించనుంది.
  • బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగానే టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటోంది. ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
  • అంతర్జాతీయంగా కంటైనర్‌ మార్కెట్‌లో అవాంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంపై ఈ ప్రభావం కొనసాగనుంది.
  • ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడే స్థాయిలోనే ఆర్థిక స్థితిగతులు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రైవేట్‌ పెట్టుబడులు పుంజుకోగలవు.
  • 2013–14 తర్వాత నుంచి జాతీయ రహదారులు/రోడ్ల నిర్మాణం గణనీయంగా పెరిగింది. 
  • 2019–20లో 10,237 కిలోమీటర్ల మేర, 2020–21లో 13,327 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగింది. 2021–22 (సెప్టెంబర్‌ వరకూ) 3,824 కిలోమీటర్ల రోడ్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం పూర్తయ్యింది.

క్రిప్టో కరెన్సీలపై తటస్థ వైఖరి..

  •  దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టో కరెన్సీల ప్రభావం ఉంటుంది కనుక.. వాటి నియంత్రణ విషయంలో తటస్థ వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనమిక్‌ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్‌ సన్యాల్‌ పేర్కొన్నారు.
  • సర్వేలో పేర్కొన్న 2022–23 వృద్ధి.. ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగా, ఎస్‌అండ్‌పీ.. మూడీస్‌ అంచనాలకన్నా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) 9 శాతం కన్నా తక్కువగానే ఉంది.
భారత ఎకానమీ తీరు ఇలా...
ఆర్థిక సంవత్సరం   వృద్ధి (శాతాల్లో)
2017–18  7.0 
2018–19    6.0 
2019–20   3.7 
2020–21 మైనస్‌ 6.6 
2021–22 9.2 (అంచనా)
2022–23  8–8.5 శ్రేణి (అంచనా)

చ‌ద‌వండి >> భారత ఆర్థిక సర్వే : 2020-21

ఆర్థిక సర్వే అంటే ఏంటి?
గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, పనితీరు ఎలా ఉందో ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు ఏంటివి? వీటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు కూడా ఆర్థిక సర్వేలో ఉంటాయి. ఏటా బడ్జెట్‌కు ముందు ఈ సర్వేను విడుదల చేస్తారు.

ఆర్థిక సర్వేను ఎవరు రూపొందిస్తారు?
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ (డీఈఏ)లోని ఎకనమిక్‌ డివిజన్‌ ప్రతి ఏడాది ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. సాధారణంగా ప్రధాన ఆర్థిక సలహాదారు(చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌– సీఈఏ) నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది. సర్వేను ఆర్థికమంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. తొలి ఆర్థిక సర్వేను 1950–51లో ఆవిష్కరించారు.

Published date : 21 Feb 2022 12:45PM

Photo Stories