Adani group: సమాజ సేవకు అదానీ రూ. 60 వేల కోట్ల విరాళం
ఆసియాలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం సమాజం కోసం పెద్ద మనసు చేసుకుంది. రూ.60,000 కోట్లను విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 24న గౌతమ్ అదానీ 60వపుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. హెల్త్‌కేర్, విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో ఈ విరాళాలను ఖర్చు చేయనున్నట్టు అదానీ ఫౌండేషన్ ప్రకటించింది. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విరాళాల్లో ఇది కూడా ఒకటి. దీంతో మార్క్ జుకెర్‌బర్గ్, వారెన్ బఫెట్, విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, అనిల్ అగర్వాల్ తదితర భూరీ విరాళాలను ప్రకటించిన దాతల చెంత అదానీ కూడా చేరిపోయారు. రూ. 60 వేల కోట్ల విరాళాల వినియోగాన్ని అదానీ ఫౌండేషన్ చూడనుంది. బొగ్గు, మైనింగ్, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్యాస్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎఫ్‌ఎంసీజీ ఇలా ఎన్నో రంగాల్లో అదానీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అదానీ సంపద విలువ 92 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు ప్రకటించిన విరాళం ఇందులో 8 శాతంగా ఉంది.
Also read: World's most liveable city: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరం ఏదంటే..