Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 21st కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 21st 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

United Nations:మాకు ఆ భ్రమలు లేవు.. రష్యా–ఉక్రెయిన్‌ శాంతి చర్చలపై ఐరాస
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాల్లేవని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అన్నారు. శాంతి చర్చలు జరిగి, యుద్ధం ఆగుతుందన్న భ్రమలు లేవన్నారు. చర్చల ద్వారా నల్ల సముద్రం గుండా ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతుల వంటివాటిపై దృష్టి పెట్టామన్నారు. 2023లో ఉక్రెయిన్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నామని ఆయ‌న తెలిపారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (నవంబర్ 25 - డిసెంబర్ 02, 2022)

America-South Korea: దక్షిణ కొరియా–అమెరికా సంయుక్త విన్యాసాలు
దక్షిణ కొరియా సముద్రజలాల్లో జేజూ ద్వీపం వద్ద డిసెంబ‌ర్ 20 నుంచి వారం రోజుల పాటు దక్షిణ కొరియా–అమెరికా సంయుక్త విన్యాసాలు జ‌రుగుతున్నాయి. అమెరికా బీ–52 అణు బాంబర్‌ విమానాలు, ఎఫ్‌–22లకు కొరియా ఎఫ్‌–35, ఎఫ్‌–15 యుద్ధవిమానాలు పాల్గొన్నాయి. దక్షిణ కొరియాలో విన్యాసాల కోసం అమెరికా ఎఫ్‌–22 విమానాలను రప్పించడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. తమ సైనిక సామర్థ్యాన్ని దక్షిణ కొరియా, అమెరికా తక్కువ అంచనా వేయొద్దని ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ హెచ్చరించిన వేళ ఈ రెండు దేశాలు వైమానిక విన్యాసాలకు సిద్ధమయ్యాయి. 

Covid Cases: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం.. ఆస్పత్రుల్లో శవాల గుట్టలు 
చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. మందులు దొరకడం లేదు. కరోనా రోగులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిల్చొంటున్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆస్పత్రుల కారిడార్లలో, మార్చురీలలో శవాలు వరసగా పెట్టి ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. శ్మశాన వాటికల్లో రోజూ వందలాది మృతదేహాలు వస్తున్నాయి. రోజుకి దాదాపుగా 40 వేల మందికి కరోనా సోకుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ  చైనా ప్రభుత్వం మాత్రం కేసుల సంఖ్యని తక్కువ చేసి చూపిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నా డిసెంబ‌ర్ 20న‌ కేవలం ఐదుగురే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో త్వరితంగా వ్యాప్తి చెందే బిఏ.5.2, బిఎఫ్‌.7 సబ్‌ వేరియంట్లు విస్తరిస్తున్నాయి.  

China Protest: చైనాలో ఉక్కుపాదం.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు
రాబోయేవి గడ్డు రోజులు  

చైనాలో ఇక మీద గడ్డు రోజులు ఎదుర్కోబోతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో చైనా జనాభాలో 60 శాతానికి పైగా కరోనా బారిన పడతారని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వ్యాధి నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ అంచనా వేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వచ్చే ఏడాది చైనాలో రోజుకి లక్ష కేసులు నమోదవుతాయని, 20 లక్షల మంది మరణిస్తారని పలు నివేదికలు హెచ్చరించాయి. వృద్ధుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడంలో చూపించిన నిర్లక్ష్యానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నాయి. కరోనాలో అత్యంత కీలకమైన ఆర్‌ వాల్యూ (ఒక వ్యక్తి నుంచి వైరస్‌ ఎంతమందికి సంక్రమిస్తుందో చెప్పే విధానం) 16గా ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అంటే ఒక వ్యక్తి ద్వారా వైరస్‌ 16 మందికి సోకుతుందన్న మాట. 2019లో వూహాన్‌లో కరోనా బట్టబయలయ్యాక ఇంతటి ఘోరమైన పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్‌  ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనాతో ఈ మూడేళ్లలో 3.80 లక్షల కేసులు నమోదైతే, 5,242 మంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్‌ డేటా మాత్రం ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, గత 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెబుతోంది.  

Covid Death: వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి?

ఎందుకీ పరిస్థితి?  
☛ చైనా ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానంతో కఠినమైన నిబంధనలు విధించి లక్షణాలు లేని వారిని క్వారంటైన్‌ చేయడం, మూకుమ్మడి పరీక్షలు, రోగులతో కాంటాక్టయిన వారిని నాలుగ్గోడల మధ్య ఉంచడం వంటివి చేయడంతో ఇన్నాళ్లూ కేసులు వెలుగులోకి రాలేదు. నెలల తరబడి లాక్‌డౌన్‌లు, గదుల్లో తాళాలు వేసే కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జీరో కోవిడ్‌ విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 7న వెనక్కి తీసుకుంది. 
☛ ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకకపోవడంతో వైరస్‌ను ఎదుర్కొనే సహజసిద్ధమైన ఇమ్యూనిటీ చైనాలో చాలామందికి రాలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తేయడంతో ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగిపోయాయి. 
☛ చైనా తాను సొంతంగా తయారు చేసిన సినోవాక్, సోనిఫార్మ్‌ వ్యాక్సిన్లనే వాడింది. 350 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. వీటి సామర్థ్యంపై సవాలక్ష సందేహాలున్నాయి. పైగా 80 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ఇప్పుడు వాళ్లే వైరస్‌ క్యారియర్లుగా మారారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
☛ కరోనా వైరస్‌ మానవ నిర్మితమేనని పలు నివేదికలు నిర్ధారించడంతో దీని వ్యాప్తి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు చైనాలో మరో వేవ్‌ మొదలైందని, దీని వల్ల పలు కొత్త వేరియెంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని సింగపూర్‌ యూనివర్సిటీలో వైస్‌ డీన్‌ అలెక్స్‌ కుక్‌ అంచనా వేస్తున్నారు. చైనాలో పరిస్థితి ఇతర దేశాలకు ప్రమాదకరమేనని ఆయన హెచ్చరించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (25 నవంబర్ - 02 డిసెంబర్ 2022)

Kepler Planets: నీటి గ్రహాలు.. భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవి!
భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలోని లైరా అనే పాలపుంతలో ఓ ఎర్రని మరుగుజ్జు తార చుట్టూ పరిభ్రమిస్తున్న కెప్లర్‌–138సి, కెప్లర్‌–138డి అనే రెండు గ్రహాలను సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇందులో వింతేముందంటారా? పరిమాణంలో భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవైన ఇవి రెండూ దాదాపుగా నీటితో నిండి ఉన్నాయట! నాసా కెప్లర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ వీటి ఉనికిని బయట పెట్టింది. వాటిపై ఉన్న పదార్థం శిలల కంటే తేలికగా, హైడ్రోజన్, హీలియం కంటే భారంగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. కనుక అది కచ్చితంగా నీరే అయి ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటి నీటి గ్రహాల ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి! దీనికి సంబంధించి నేచర్‌ ఆ్రస్టానమీ జర్నల్‌లో లోతైన అధ్యయనం పబ్లిషైంది. 

Cosmic Violence: అరుదైన అంతరిక్ష దృగ్విషయం.. అంత్య దశలో ఉన్న నక్షత్రాన్ని..

Insight Mars lander: ఇన్‌సైట్‌ లాండర్‌ తుది సందేశం 
నాలుగేళ్లుగా అంగారకుని ఉపరితలంపై పరిశోధనలు చేస్తున్న నాసా ఇన్‌సైట్‌ లాండర్‌ తాజాగా పంపిన స్వీయ చిత్రమిది. అంగారకుని తాలూకు దుమ్మూ ధూళీ దానిపై పూర్తిగా పరుచుకుని ఉండటాన్ని గమనించవచ్చు. దాని సౌర పలకలను దుమ్ము పూర్తిగా కప్పేసింది. దాంతో త్వరలో లాండర్‌కు నాసాతో సంబంధాలు శాశ్వతంగా తెగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ‘‘నా శక్తి పూర్తిగా ఉడిగిపోయింది. బహుశా నేను పంపే చివరి ఫొటో ఇదే కావచ్చు’’ అంటూ సందేశం పంపింది! ‘‘రెండు గ్రహాల మీద గడిపే అదృష్టం నాకు దక్కింది. త్వరలో శాశ్వతంగా సెలవు తీసుకుంటా. ఇంతకాలం నాతోపాటు ఉన్నందుకు థాంక్స్‌. నా గురించి బాధ పడొద్దు’’ అని చెప్పుకొచ్చింది. అంగారకుని లోపలి పొరలపై పరిశోధన తదితరాల కోసం నాసా దాన్ని నాలుగేళ్ల క్రితం ప్రయోగించింది. రెండేళ్లు పని చేస్తే చాలని భావించగా అది ఏకంగా నాలుగేళ్ల పాటు అరుదైన ఫొటోలు, సమాచారం పంపుతూ వచ్చింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Women T20: టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా 
సొంతగడ్డపై డిసెంబ‌ర్ 20న జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 54 పరుగులతో భారత్ ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా 4–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా.. భారత్‌ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.  
కాగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో ఆ్రస్టేలియా చేతిలో భారత్‌ ఓడిన మ్యాచ్‌లు 13. ద్వైపాక్షిక టి20 సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 150 అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన తొలి జట్టుగా ఆ్రస్టేలియా నిలిచింది.   

BWF World Rankings: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 
ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) పురుషుల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకున్నారు. డిసెంబ‌ర్ 20న‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ 75,806 పాయింట్లతో ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఈ సంవత్సరం సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఇండియన్‌ ఓపెన్‌ సూపర్‌–500, ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌–750 టోర్నీల్లో టైటిల్స్‌ సాధించింది. అంతేకాకుండా కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, థామస్‌ కప్‌లో తొలిసారి భారత్‌ చాంపియన్‌గా అవతరించడంలోనూ వీరిద్దరు కీలకపాత్ర పోషించారు. పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో లక్ష్య సేన్‌ ఏడో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. ప్రణయ్‌ రెండు స్థానాలు పురోగతి సాధించి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కిడాంబి శ్రీకాంత్‌ 11వ స్థానంలో ఉన్నాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఆరో ర్యాంక్‌లో మార్పు లేదు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రెండు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంక్‌లో నిలిచింది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

SA20 2023: ఎస్‌ఏ టి20 లీగ్ ప్రైజ్‌మనీ రూ.33.5 కోట్లు
దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తొలిసారి ఎస్‌ఏ టి20 లీగ్ నిర్వ‌హించ‌నుంది. టోర్నీలో 7 కోట్ల ర్యాండ్‌లు (రూ. 33 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు లీగ్‌ కమిషనర్, మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ వెల్లడించారు. దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద మొత్తం. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటుండగా.. ఆరు టీమ్‌లనూ ఐపీఎల్‌కు చెందిన యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్, పార్ల్‌ రా యల్స్, జొహన్నెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్, సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌ పేర్లతో జట్లు బరిలోకి దిగుతాయి.   

cricket Test Series: ఇంగ్లండ్‌ క్లీన్ స్వీప్‌ 
పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–0తో సొంతం చేసుకుంది. హ్యారీ బ్రూక్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. జట్టులో ఇద్దరు సీనియర్‌ పేసర్లు అండర్సన్, స్టువర్ట్‌ బ్రాడ్‌ లేకుండా 2007 తర్వాత ఇంగ్లండ్‌ గెలిచిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. స్వదేశంలో పాక్‌ ‘క్లీన్‌స్వీప్‌’ కావడం ఆ జట్టు టెస్టు చరిత్రలో ఇదే మొదటిసారి.    

CIBIL Score: ఎంఎస్‌ఎంఈలకూ సిబిల్‌ స్కోరు 
ఇప్పటివరకూ వ్యక్తులకు మాత్రమే క్రెడిట్‌ స్కోరు ఇస్తున్న ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) కూడా ర్యాంకింగ్‌ వ్యవస్థను ఆవిష్కరించింది. ఆన్‌లైన్‌ పీఎస్‌బీ లోన్స్‌తో కలిసి ఫిట్‌ ర్యాంక్‌ను ప్రవేశపెట్టింది. కరెంటు అకౌంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, జీఎస్‌టీ రిటర్నుల ఆధారంగా 6 కోట్ల పైచిలుకు ఎంఎస్‌ఎంఈలకు 1–10 స్కోరును ఇవ్వనుంది. చిన్న వ్యాపారాలకూ రుణ సదుపాయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, అలాగే ఆర్థిక సంస్థలు మొండిబాకీల వల్ల నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థ చెల్లింపు సామర్థ్యాలపై ఆర్థిక‌ సంస్థ ఒక అవగాహనకు వచ్చేందుకు ర్యాంకింగ్‌ సహాయపడగలదని సిబిల్‌ ఎండీ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన సాధనాన్ని ఉపయోగించి బ్యాంకులు రూ.1 కోటి వరకూ రుణాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

Current Affairs (Science & Technology) క్విజ్ (18-24 నవంబర్ 2022)  

Published date : 21 Dec 2022 06:29PM

Photo Stories