Skip to main content

China Protest: చైనాలో ఉక్కుపాదం.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

చైనాలో జీరో కొవిడ్‌ పాలసీపై దేశవ్యాప్తంగా తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తీరుతో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉలిక్కిపడింది.

వాటిని తక్షణం కట్టడి చేయడమే లక్ష్యంగా రంగంలోకి దిగింది. నిరసనలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనకారులను పోలీసులు భారీ సంఖ్యలో అరెస్టు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని తక్షణం డిలీట్‌ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. లేదంటే నిర్బంధం తప్పదంటూ బెదిరిస్తున్నారు.
న‌వంబ‌ర్ 27న‌ షాంఘైలో నిరసనలను కవర్‌ చేస్తున్న బీబీసీ జర్నలిస్టు ఎడ్‌ లారెన్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సందర్భంగా ఆయన్ను విచక్షణారహితంగా కొట్టడంతో పాటు తన్నారని బీబీసీ ఆరోపించింది. కొద్ది గంటల నిర్బంధం అనంతరం వదిలేశారు. ఆయన్ను పోలీసులు హింసించడం అవాస్తవమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లీ జియాన్‌ అన్నారు. తమ జీరో కోవిడ్‌ విధానం సరైందంటూ సమర్థించుకున్నారు. మీడియా చెబుతున్న స్థాయిలో నిరనసలు జరగడం లేదంటూనే, ‘‘జనాల్లో కాస్తంత వ్యతిరేకత ఉండొచ్చు. అందుకే క్షేత్రస్థాయి పరిస్థితులకు తగ్గట్టుగా జీరో కొవిడ్‌ విధానంలో మార్పులు తెస్తున్నాం’’ అని అంగీకరించారు. మరోవైపు కరోనా ఆంక్షలపై దేశమంతటా జనాగ్రహం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్, దేశంలో అతి పెద్ద నగరం షాంఘైతో పాటు పలు నగరాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ వీధుల్లోకి వచ్చి ఆంక్షలపై గళమెత్తుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు దిగొద్దని చైనాకు ఐక్యరాజ్యసమితి హితవు పలికింది. వారి హక్కులను గౌరవించాలని సూచించింది. 
మళ్లీ 40 వేల కేసులు.. 
మరోవైపు సోమవారం చైనాలో 39,452 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. బీజింగ్‌లో వరుసగా ఐదో రోజూ 4,000 కేసులొచ్చాయి. లాక్‌డౌన్లు, సరకు రవాణా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 41.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనావేసింది.  
వైట్‌ పేపర్‌ రివల్యూషన్‌.. 
దేశంలో తమకు ఏ మాత్రమూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేవని చెప్పేందుకు చైనా యువత, ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రతీకాత్మకంగా తెల్ల కాగితాలను ప్రదర్శిస్తున్నారు. ‘వైట్‌ పేపర్‌ రివల్యూషన్‌’ పేరుతో ఇది దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది.  

Major Disasters In India : భార‌త‌దేశ చరిత్రలో జ‌రిగిన‌ పెను విషాదాలు ఇవే..
 

Published date : 29 Nov 2022 05:56PM

Photo Stories