Skip to main content

Major Disasters In India : భార‌త‌దేశ చరిత్రలో జ‌రిగిన‌ పెను విషాదాలు ఇవే..

మచ్చూ నదిపై కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురి ఆచూకీ గల్లంతు కాగా.. సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో జ‌రిగిన ఈ విషాద ఘటనతో యావత్‌ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

అయితే, ఇలాంటి పెను విషాద సంఘటనలు గతంలోనూ జరిగాయి. తొక్కిసలాటలు, ప్రకృతి విపత్తుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మోర్బీ దుర్ఘటన వేళ అలాంటి కొన్ని సంఘటనలు ఓసారి చూద్దాం.

ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి?

2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. 

2016, ఏప్రిల్ 10 : కేరళలోని కొల్లాంకు సమీపంలోని ఆలయ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 110 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 280 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆలయం ఆధ్వర్యంలో బాణసంచా ప్రదర్శన చేపట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
2016, మార్చి 31 :  పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న వివేకానంద పైవంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్‌పై హత్య కేసు నమోదైంది. 

2014, అక్టోబర్ 3 : బిహార్ రాజధాని పాట్నాలో దసరా ఉత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. గాంధీ మైదాన్‌లో నిర్వహించిన రావణ దహణం కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. మొత్తం 32 మంది ప్రాణాలు విడిచారు. 

2013, అక్టోబర్ 13 : మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా రతన్‌గఢ్‌ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 115 మంది దుర్మరణం చెందారు. మరో 100 మంది వరకు గాయపడ్డారు. నదిపై ఉన్న వంతెన కూలిపోయే ప్రమాదం ఉందనే వార్త వ్యాప్తి చెందడంతో అది తొక్కిసలాటకు దారితీసింది.

2013, ఫిబ్రవరి 10 : కుంభమేళ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ఇందులో 36 మంది మరణించారు. 

2012, నవంబర్ 19 : బిహార్‌ రాజధాని పాట్నాలో గంగానదిలోని అదాలత్‌ ఘాట్‌ వద్ద చట్‌ పూజ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 

2011, జనవరి 14 : కేరళలోని శబరిమల ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. 

2010, మార్చి 4 :  ఉత్తర్‌ప్రదేశ్‌, ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని రామ్‌ జానకి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఓ బాబా ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నారని తెలిసి భారీగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి 63 మంది మరణించారు.

2008, సెప్టెంబర్ 30 : రాజస్థాన్‌, జోధ్‌పుర్‌ నగరంలోని చాముంఢాదేవి ఆలయంలో బాంబు కలకలం సృష్టించింది. దీంతో తొక్కిసలాట జరిగి 250 మంది మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు.

2008, ఆగస్టు 3 : హిమాచల్‌ ప్రదేశ్‌ బిలాస్‌పుర్‌ జిల్లాలోని నైనా దేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయనే వార్త కలకలం సృష్టించింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. తొక్కిసలాట జరిగి 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు. 

2005, జనవరి 25 : మహారాష్ట్ర, సతారా జిల్లాలోని మంధారదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 340 మంది భక్తులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. 

భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి?

1997, జూన్ 13 : దేశరాజ ధాని ఢిల్లీలోని ఉఫహార్‌ థియేటర్‌లో బాలీవుడ్‌ సినిమా ‘బార్డర్‌’ ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 59 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 

1997, ఫిబ్రవరి 23 :  ఒడిశా, బారిపడా జిల్లాలో ఓ వర్గానికి చెందిన నాయకుడి సమావేశంలో మంటలు చెలరేగి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో 206 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. 

1954, ఫిబ్రవరి 3 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో మొత్తం 800 మందికిపైగా మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. భారత స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళగా భావించటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు.

విపత్తులు - ప్రాథమిక భావనలు

Published date : 31 Oct 2022 07:19PM

Photo Stories