Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, డిసెంబ‌ర్ 20th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu December 20th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Nirmala Sitharaman: చెలామణిలో ఉన్న నోట్ల విలువ.. రూ.31.92 లక్షల కోట్లు
ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో చెప్పారు. ‘‘జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతోపాటు డిజిటల్‌ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్‌బీఐ, కేంద్రం బాధ్యత’’ అన్నారు. మరోవైపు, 60 పాత చట్టాల రద్దుకు, ఒక చట్టంలో సవరణకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే భూ సేకరణ (గనులు) చట్టం (1885), టెలిగ్రాఫ్‌ వైర్స్‌ చట్టం(1950) వంటివి రద్దవుతాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Warship: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు
థాయ్‌లాండ్‌ సముద్రజలాల్లో ఆ దేశానికి చెందిన ఓ యుద్ధనౌక మునిగిపోయింది. ప్రచుయాప్‌ ఖిరి ఖాన్‌ ప్రావిన్స్‌లోని బాంగ్‌సఫాన్‌ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్‌టీఎంఎస్‌ సుఖోథాయ్‌ యుద్ధనౌక గస్తీ కాస్తోంది. ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. డిసెంబ‌ర్ 18న‌ రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్‌ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 31 మంది నావికులు గల్లంతు అయ్యారు. వీరి కోసం థాయ్‌లాండ్‌ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషిస్తోంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Elon Musk: ట్విట్టర్‌ సీఈవోగా మస్క్ తప్పుకోవాలని 57.5 శాతం ఓట్లు
సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ డిసెంబ‌ర్ 19న‌ ఒక ట్వీట్‌చేశారు. ‘ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ట్వీట్ పేర్కొన్నారు. దీనిపై ట్విటర్‌ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్‌’ చెబుతూ ఓట్లు వేశారు. మస్క్‌ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్‌ అయ్యాయని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. దాదాపు 44 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతోంది.   

Ashok Gehlot: ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్‌ 
కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద లబ్ధిపొందే రాష్ట్రంలోని పేదలకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఏడాదికి 12 సిలిండర్లు ఈ ధరకే అందిస్తామ‌ని తెలిపారు. ‘ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు అయితే ఇచ్చారుగానీ ధరలు రూ.400 నుంచి ఏకంగా రూ.1,040కి పెరగడంతో ఎవరూ కొత్తగా సిలిండర్లు బుక్‌చేయడం లేదు. రాష్ట్రంలో ఇకపై ఉజ్వల పథకం లబ్దిదారులైన దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదలకు రూ.500కే ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తాం’ అని గెహ్లాట్‌ చెప్పారు.  

Weekly Current Affairs (National) క్విజ్ (18-24 నవంబర్ 2022)

UN Conference: జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యం.. 200 దేశాల ఆమోదముద్ర  
ఏళ్ల తరబడి జరిగిన చర్చోపచర్చలు, సంప్రదింపులు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. భూమిపై జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే దిశగా కీలక ముందడుగు పడింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కెనడాలోని మాంట్రియల్‌లో డిసెంబర్‌ 7 నుంచి జరుగుతున్న కాప్‌–15 అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో సహా దాదాపు 200 దేశాలు ఈ విషయంలో విభేదాలు వీడి ఒక్కతాటిపైకి వచ్చాయి. కీలకమైన కుమ్నింగ్‌–మాంట్రియల్‌ జీవవైవిధ్య ప్రణాళిక (జీబీఎఫ్‌)కు డిసెంబ‌ర్ 19న‌ అంగీకారం తెలిపాయి. ఈ మేరకు ‘‘కున్మింగ్‌–మాంట్రియల్‌’ ఒప్పందం ఆమోదముద్ర పొందినట్టు సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న చైనా పర్యావరణ మంత్రి హువాంగ్‌ రుంక్యూ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పారిస్‌ ఒప్పందం తరహాలోనే పర్యావరణ పరిరక్షణ యత్నాల్లో దీన్నో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో భూ భాగాలు, సముద్ర జలాలతో పాటు జంతు జాతులను కాలుష్యం, వాతావరణ మార్పుల బారినుంచి పూర్తిస్థాయిలో రక్షించడం ఈ ఒప్పందం లక్ష్యం.
అయితే ఇందుకు సమకూర్చాల్సిన ఆర్థిక ప్యాకేజీపై ఎంతోకాలంగా పడ్డ పీటముడి ఎట్టకేలకు వీడింది. ఆ మొత్తాన్ని ఇతోధికంగా పెంచి 2030 కల్లా ఏటా 200 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని నిర్ణయం జరిగింది. 2020లో అంగీకరించిన మొత్తంతో పోలిస్తే ఇది రెట్టింపు! ఈ కీలక అంగీకారం నేపథ్యంలో ఒప్పందానికి మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. వాటిని 2030కల్లా సాధించాలన్నది లక్ష్యం. దీన్ని ప్రపంచ ప్రజల విజయంగా వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ మార్కో లాంబెర్టినీ అభివర్ణించారు. అయితే, లక్ష్యసాధనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం ఈ ఒప్పందంలో కీలక లోపమని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ గ్లోబల్‌ పాలసీ సీనియర్‌ డైరెక్టర్‌ లిన్‌ లీ అన్నారు. 

UNO: పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే!
50 ఏళ్లలో భారీ విధ్వంసం 

జీవ వైవిధ్యానికి గత 50 ఏళ్లలో కనీవినీ ఎగరని స్థాయిలో ముప్పు వాటిల్లింది. చాలా రకాల జీవ జాతులు 1970 నుంచి ఏకంగా 69 శాతం క్షీణించాయని వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌–లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక (ఎల్‌పీఆర్‌) పేర్కొంది. పర్యావరణానికి జరుగుతున్న ఈ అపార నష్టానికి అడ్డుకట్ట వేసి జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు తాజాగా ఒప్పందమైతే కుదిరింది. కాకపోతే దాని అమలులో దేశాలు ఏ మేరకు చిత్తశుద్ధి కనబరుస్తాయన్నది కీలకం. ఎందుకంటే ఇందుకోసం ఏటా 200 బిలియన్‌ డాలర్లు వెచ్చించేందుకు ఎట్టకేలకు అంగీకారం కుదిరినా, ఇందులో వర్ధమాన దేశాల అవసరాలు తీర్చేందుకు సంపన్న దేశాలు కేటాయించబోయే వాటా ఎంత వంటి కీలకాంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.  
ఒప్పందం లక్ష్యాలివీ.. 
జీవ వైవిధ్య పరిరక్షణకు 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగిన కాప్‌–10 సదస్సులో దేశాలన్నీ పలు లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. అవి చాలావరకు లక్ష్యాలుగానే మిగిలిపోయాయి. దాంతో మరోసారి అంతర్జాతీయ స్థాయి మేధోమథనం కోసం 2020 అక్టోబర్లో చైనాలోని కుమ్నింగ్‌లో తలపెట్టిన కాప్‌–15 సదస్సు కరోనా వల్ల వాయిదా పడింది. అది తాజాగా రెండు దశల్లో జరిగింది. తొలి భాగం వర్చువల్‌ పద్ధతిలో ముగియగా మాంట్రియల్‌లో డిసెంబర్‌ 7 నుంచి 19 దాకా జరిగిన కీలకమైన రెండో భాగంలో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొత్తం 23 లక్ష్యాలను ప్రపంచ దేశాలు నిర్దేశించుకున్నాయి. వాటిలో ముఖ్యాంశాలు... 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)
☛ 2030 కల్లా మొత్తం భూభాగం, సాధారణ జలాలు, తీర ప్రాంతాలు, సముద్రాల్లో కనీసం 30 శాతాన్ని పూర్తిస్థాయిలో సంరక్షించి, పరిరక్షించే చర్యలు చేపట్టడం. అపార జీవ వైవిధ్యానికి నిలయమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం. ప్రస్తుతం 17 శాతం భూభాగం, కేవలం 10 సముద్ర జలాల్లో మాత్రమే పరిరక్షణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 
☛ జీవ వైవిధ్యపరంగా అపార ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో పర్యావరణ నష్టాలను అరికట్టడం
☛ ఇందుకోసం పేద దేశాలకు చేసే కేటాయింపులను 2025కల్లా ఏటా 20 బిలియన్‌ డాలర్లకు,  2030 కల్లా 30 బిలియన్‌ డాలర్లకు పెంచడం. 
☛ ప్రపంచ ఆహార వృథాను సగానికి తగ్గించడం. 
☛ వనరుల విచ్చలవిడి వాడకాన్ని, తద్వారా వ్యర్థాల ఉత్పత్తిని వీలైనంత కట్టడి చేయడం. 
☛ సాగులో పురుగు మందులు, ఇతర అత్యంత ప్రమాదకర రసాయనాల వాడకాన్ని కనీసం సగానికి తగ్గించడం. 
☛ జీవ వైవిధ్యానికి అపారమైన హాని కలిగించే సాగు సబ్సిడీలను 2030 నాటికి ఏటా 500 బిలియన్‌ డాలర్ల చొప్పున తగ్గించడం. 
☛ జీవ వైవిధ్య సంరక్షణకు దోహదపడే పథకాలు, చర్యలకు ప్రోత్సాహకాలను పెంచడం.  
☛ భారీ, అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, తమ కార్యకలాపాల వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కలిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా వెల్లడించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం. 
☛ ఆ నష్టాలను అవి కనీస స్థాయికి పరిమితం చేసేలా చర్యలు తీసుకోవడం. 

UNSC: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం
Skoch Awards: ఏపీకి ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు
ఏపీలో సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం ఆరు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. డిసెంబ‌ర్ 19న ఢిల్లీలో స్కోచ్‌ గ్రూప్‌ నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి స్కోచ్‌ అవార్డు లభించింది. గుడ్‌ గవర్నెన్స్‌ అండ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కేటగిరీలో 2021–22కి ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను స్కోచ్‌ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్‌ అవార్డుకు ఎంపిక చేసింది. సెర్ప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ బ్యాంకులతోపాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా, అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తోంది. ఇందుకుగాను స్కోచ్‌ మరో గోల్డ్‌ అవార్డును ప్రకటించింది. గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్‌ అవార్డులు దక్కాయి. 

PSLV C54: పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

Chess Championship: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌కు బిడ్జ్ టైటిల్‌
స్పెయిన్‌లో జరిగిన సన్‌వే సిట్‌గెస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల రాజా రిత్విక్‌ చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత రాజా రిత్విక్‌ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్‌ అజేయంగా నిలిచాడు. కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థి అయిన రిత్విక్‌ ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రముఖ కోచ్‌ ఎన్‌.రామరాజుకు చెందిన రేస్‌ చెస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న రిత్విక్‌.. ఈ టోర్నీలో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఆధిబన్, అరవింద్‌ చిదంబరం (భారత్‌), స్వెన్‌ ఫ్రెడరిక్‌ (జర్మనీ)పై గెలిచి మరో గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ కల్యాణ్‌ (భారత్‌)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Mount Vinson: విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి
తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబ‌ర్‌ 2న హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. మైనస్‌ 25 నుంచి మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్‌ పర్వతాన్ని డిసెంబ‌ర్‌ 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్‌ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్‌ 7న యూరప్‌లోని ఎల్‌బ్రోస్‌ పర్వతాలను ఎక్కారు.  

FIFA World Cup: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా

Published date : 21 Dec 2022 11:07AM

Photo Stories