Daily Current Affairs in Telugu: 2022, డిసెంబర్ 13th కరెంట్ అఫైర్స్
Bhupendra Patel: గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
గుజరాత్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజధాని గాందీనగర్‌లో నూతన సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది రెండోసారి. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయించారు. అలాగే 16 మంది మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 8 మంది.. కానూ దేశాయ్, రిషికేశ్ పటేల్, రాఘవ్‌జీ పటేల్, బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్, కున్వర్‌జీ బవాలియా, మూలూ బేరా, కుబేర్ దిందోర్, భానూబెన్ బబారియాకు కేబినెట్ ర్యాంకు దక్కింది. 11 మంది మాజీ మంత్రులకు మరోసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. మంత్రివర్గంలో ఒక మహిళ ఉన్నారు.
Sukhvinder Singh: హిమాచల్ సీఎంగా సుఖ్వీందర్
మున్సిపాలిటీ సభ్యుడి నుంచి సీఎం స్థాయికి
భూపేంద్ర.. పటీదార్‌లోని కేడ్వా ఉపకులానికి చెందిన వ్యక్తి. సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన భూపేంద్ర తొలినాళ్లలో రాజకీయాల్లోకి వచ్చినపుడు అహ్మదాబాద్ జిల్లాలోని మేమ్‌నగర్ మున్సిపాలిటీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1995–2006 వరకు మున్సిపాలిటీ సభ్యునిగా కొనసాగారు. అదే మున్సిపాలిటీకి రెండు సార్లు అధ్యక్షుడిగానూ సేవలందించారు. తర్వాత అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)కు స్థాయి కమిటీ చైర్మన్‌గా 2010నుంచి 2015దాకా పనిచేశారు. ఏఎంసీ అనేది గుజరాత్‌లోనే అత్యంత పెద్ద మున్సిపాలిటీ. ఆ తర్వాత ఆయన అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి 2015 నుంచి రెండేళ్లపాటు చైర్మన్‌గా పనిచేశారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తుండే ఈయనను స్థానికంగా అందరూ ‘దాదా’ అని పిలుచుకుంటారు. పటీదార్ల సామాజిక, ఆర్థిక ప్రగతికి కృషిచేసే సర్దార్‌ధామ్ విశ్వ పటీదార్ కేంద్రానికి ట్రస్టీగా కొనసాగారు. రాజకీయాల్లో మరింత ఎదిగిన భూపేంద్ర ఆ తర్వాత మాజీ మహిళా ముఖ్యమంత్రి, ప్రస్తుత యూపీ గవర్నర్ అయిన ఆనందీబెన్ పటేల్ నియోజకవర్గమైన ఘట్లోడియా నుంచి తొలిసారిగా 2017లో ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా మరోసారి అదే నియోజకవర్గంలో ఏకంగా 1.17 లక్షల మెజారిటీతో గెలుపుబావుటా ఎగరేశారు. అహ్మదాబాద్‌లోని శిలాజ్ ప్రాంతంలో భార్య హీతల్‌బెన్‌తో నివసించే ఈయనకు క్రికెట్, బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గాపాల్గొంటారు.
Assembly Elections: గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ గెలుపు
Supreme Court: ఈడీ డైరెక్టర్ పదవీ కాలం ఎందుకు పొడిగించారు?
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడుసార్లు ఎందుకు పొడిగించారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), ఈడీ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రంతోపాటు సీవీసీకి నోటీసులు జారీ చేసింది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని, తద్వారా ప్రజాస్వామ్య నిర్మాణాన్ని ధ్వంసం చేస్తోందని జయా ఠాకూర్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సంజయ్‌కుమార్ మిశ్రాకు పొడిగింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వు జారీ చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఆక్షేపించారు.
Justice Dipankar Datta: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దీపాంకర్
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా డిసెంబర్ 12న ప్రమాణంచేశారు. ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం కోర్టురూమ్ నంబర్1లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దీపాంకర్ చేత ప్రమాణంచేయించారు. జస్టిస్ దత్తా తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ గతంలో కలకత్తా హైకోర్టులో జడ్జిగా సేవలందించారు. జస్టిస్ దత్తా ప్రమాణస్వీకారం తర్వాత సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. భారత రాజ్యాంగ నిబంధనలప్రకారం చూస్తే సీజేతో కలుపుకుని సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది వరకు జడ్జీలు ఉండొచ్చు. జస్టిస్ దత్తా సుప్రీంకోర్టులో 2030 ఫిబ్రవరి ఎనిమిదో తేదీదాకా జడ్జిగా కొనసాగుతారు.
JSW Steel Plant: కడపలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఉక్కు కర్మాగారం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా రూ.23,985 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వైఎస్సార్ కడప జిల్లాకు ఇచ్చిన హామీ మేరకు గట్టి ప్రయత్నంతో దేశంలో రెండో అతి పెద్ద స్టీల్ దిగ్గజ కంపెనీ జేఎస్‌డబ్ల్యూని సీఎం జగన్ ఒప్పించి ఉక్కు కర్మాగారం నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 12న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
ఎస్‌ఐపీబీ ఆమోదించినప్రాజెక్టులు ఇవీ..
దేశంలో రెండో అతిపెద్ద స్టీల్ గ్రూప్ జేఎస్‌డబ్ల్యూ
వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ రెండు విడతల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొదటి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా ఒక మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు కానుంది. రెండో విడతలో మరో రెండు మిలియన్ టన్నులతో కలిపి మొత్తం 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్ అందుబాటులోకి రానుంది. స్టీల్, ఎనర్జీ, తయారీ, సిమెంటు, పెయింటింగ్ లాంటి పలు రంగాల్లో విస్తరించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ విలువ సుమారు రూ.1,76,000 కోట్లు (22 బిలియన్ డాలర్లు) ఉంటుంది. ఏటా 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ద్వారా దేశంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా జేఎస్‌డబ్ల్యూ నిలిచింది. కంపెనీకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో స్టీల్ ప్లాంట్లున్నాయి. తాజాగా మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏపీలో అడుగు పెడుతోంది.
ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్ ఎనర్జీ
ఉత్తరాంధ్రలో అదానీ గ్రీన్‌ఎనర్జీ పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చింది. సుమారు రూ.6,330 కోట్ల పెట్టుబడితో 1,600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వెయ్యి మెగావాట్లు, అనకాపల్లి – విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పనుంది. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉపాధి కల్పించే ఈ యూనిట్ పనులను 2024 డిసెంబర్‌లో ప్రారంభించనుంది. నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 4,196 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.
PM Narendra Modi: రూ.75 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
ఎర్రవరం, సోమశిల వద్ద రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు
ఎర్రవరం, సోమశిల వద్ద షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.8,855 కోట్లతో హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమో దం తెలిపింది. ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్లు, సోమశిల వద్ద 900 మెగావాట్లతో మొత్తం రెండు ప్రాజెక్టుల ద్వారా 2,100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమై విడతల వారీగా డిసెంబర్ 2028 నాటికి పూర్తిస్థాయిలో యూనిట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 2,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Isha Singh: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్‌కు రజతం
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. భోపాల్‌లో డిసెంబర్ 12న ముగిసిన ఈ టోర్నీలో ఇషా సింగ్ జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో 13–17తో హరియాణాకు చెందిన ఒలింపియన్ మను భాకర్ చేతిలో ఓడిపోయింది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కర్ణాటక షూటర్ టీఎస్ దివ్య విజేతగా నిలిచింది.
Volodymyr Zelensky: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్‌స్కీ
Italy shooting: ఇటలీ కేఫ్‌లో కాల్పులు.. ప్రధాని మెలోనీ స్నేహితురాలు మృతి
ఇటలీ రాజధాని రోమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో దేశ ప్రధాని స్నేహితురాలు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. రోమ్‌లోని ఫిడెన్ జిల్లాలోని ఓ కేఫ్‌లో డిసెంబర్ 11న ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 12న జరగాల్సిన తమ అపార్ట్‌మెంట్ కమిటీ రెసిడెంట్స్ కమిటీ సమావేశంపై చర్చించేందుకు కొందరు సభ్యులు ఓ కేఫ్‌లో సమావేశమయ్యారు. ఇంతలోనే తుపాకీతో అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి అందరినీ చంపేస్తానని అరుస్తూ ఒక్కసారిగా వారిపైకి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నికొలెట్టా గొలిసానో(50) తన స్నేహితురాలేనంటూ ప్రధాని జార్జియా మెలోనీ గతంలో ఆమెతో దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన మెలోనీ దేశ తొలి మహిళా ప్రధానిగా అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టారు.