Supreme Court: కొలీజియం వ్యవస్థను నీరుగార్చొద్దు
దేశంలో అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్న వ్యవస్థల్లో ఇదొకటని ఉద్ఘాటించింది. ఈ వ్యవస్థపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఏం చెప్పారన్నదానిపై తాము ఏమీ మాట్లాడదలచుకోలేదని వెల్లడించింది. కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ఏమిటంటూ కొలీజియం వ్యవస్థను కేంద్రం వ్యతిరేకిస్తోంది. న్యాయ వ్యవస్థలోనూ కొలీజియం ఉండాలని కొందరు, జడ్జీలను ప్రభుత్వమే నియమించాలని మరికొందరు అంటున్నారు. 2018 డిసెంబర్ 12 నాటి సుప్రీంకోర్టు కొలీజియం భేటీ అజెండాను బయట పెట్టాలంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలి భరద్వాజ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం డిసెంబర్ 3వ తేదీ విచారణ చేపట్టింది. సంబంధం లేని వ్యక్తులు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించవద్దంటూ ఈ సందర్భంగా సూచించింది.