Skip to main content

Supreme Court : అమరావతి రాజధాని కేసులో.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు న‌వంబ‌ర్ 28వ తేదీన (సోమవారం) విచారణ జరిపింది.
Supreme Court of India
Supreme Court

కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ‘‘హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి  అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా?. హైకోర్టు ఏమైనా టౌన్‌ ప్లానరా?. ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్‌ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించింది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేం. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేం అని సుప్రీం పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక అంశాలివే..
☛ రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదు.
☛ రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. 
☛ శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం.   
☛ తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం.  
☛ రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ  అధికారం ఉంది.
☛ ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు.
☛ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. 
☛ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి.
☛ 2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. 
☛ అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం.
☛ రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తవుతుంది. 
☛ రైతుల తో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు 
☛ వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. 
☛ రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం.  
☛ అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది , ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది.

Published date : 28 Nov 2022 04:04PM

Photo Stories