Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 24th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 24th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 24th 2022
Current Affairs in Telugu September 24th 2022

INS అధ్యక్షునిగా కేఆర్‌పీ రెడ్డి.. తెలుగు పత్రికల నుంచి తొలిసారి దక్కిన అవకాశం

 

ప్రతిష్టాత్మక ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) అధ్యక్షునిగా సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్‌ కె.రాజాప్రసాద్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎకనామిక్‌ టైమ్స్‌కు చెందిన మోహిత్‌ జైన్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సొసైటీ 83వ వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 23న జరిగింది. డిప్యూటీ ప్రెసిడెంట్‌గా రాకేశ్‌ శర్మ (ఆజ్‌ సమాజ్‌), వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంవీ శ్రేయమ్స్‌ కుమార్‌ (మాతృభూమి ఆరోగ్య మాసిక), గౌరవ కోశాధికారిగా తన్మయ్‌ మహేశ్వరి (అమర్‌ ఉజాలా), సెక్రటరీ జనరల్‌గా మేరీ పాల్‌ను ఎన్నుకున్నారు. 41 మందిని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. మోహిత్‌ జైన్‌ (ఎకనామిక్‌ టైమ్స్‌), ఐ.వెంకట్‌ (అన్నదాత), గిరీశ్‌అగర్వాల్‌ (దైనిక్‌ భాస్కర్‌), వివేక్‌ గోయంకా (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), జయంత్‌ మమెన్‌ మాథ్యూ (మలయాళమనోరమ) తదితరులు వీరిలో ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐఎన్‌ఎస్‌ అధ్యక్ష పదవి ఓ తెలుగు పత్రికకు దక్కడం ఇదే తొలిసారి. 

Also read: AP ఉప సభాపతిగా ‘కోలగట్ల’ ఏకగ్రీవం

గతంలో ఇంగ్లిష్‌ డైలీ డక్కన్‌ క్రానికల్‌కు చెందిన వెంకట్రామిరెడ్డి అధ్యక్షునిగా చేశారు. 1939లో ఏర్పాటైన ఐఎన్‌ఎస్‌ మన దేశంలో దినపత్రికలు, మేగజైన్లు్ల, పీరియాడికల్స్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో అత్యున్నత సంఘం.

Also read: Ants: మేం ఎంత మంది ఉన్నామో చూశారా..

Russia-Ukraine: ఉక్రెయిన్‌లో రిఫరెండం షురూ

 

ఆక్రమిత ఉక్రెయిన్‌ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో సెప్టెంబర్ 23న  రిఫరెండం మొదలు పెట్టింది. లుహాన్‌స్‌క్, ఖేర్సన్‌తోపాటు జపోరిజియా, డోనెట్‌స్క్ లోని కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఇది సెప్టెంబర్ 27 దాకా కొనసాగుతుందని ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వర్గాలు వెల్లడించాయి. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్‌ భాష మాట్లాడేవారే ఎక్కువ. వారంతా రష్యాలో చేరడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. రిఫరెండంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also read: Russia-Ukraine War: రష్యా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు 3 లక్షల రిజర్వు సేనలు

Mosquitoes: మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు

 

మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌తోపాటు బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిసీజ్‌ మోడలింగ్‌’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ వివరాలను సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురించారు. 

Also read: First Manned Space Launch: ఈ ఏడాదే గగన్‌యాన్‌ తొలి ప్రయోగం: కేంద్రం

మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్‌ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. 

Also read: Samudrayan Project: సముద్రాల గుట్టు ఛేదించే మత్స్య యంత్రం

  • ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్‌ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 
  • 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి.
  •  6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.   

Telangana: మెదక్‌లో రైలు కూత.. నెరవేరిన మెదక్‌ ప్రజల చిరకాల స్వప్నం

 

మెదక్‌ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సెప్టెంబర్ 23న మెదక్‌లో రైలు కూత వినిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మెదక్‌–అక్కన్నపేట రైల్వేస్టేషన్‌ మధ్య నూతన రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తూ మెదక్‌ నుంచి కాచిగూడ వరకు ప్యాసింజర్‌ రైలును మెదక్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. 

Also read: Indian Navy : 2047 నాటికి నేవీకి 100% స్వదేశీ పరిజ్ఞానంతో.. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం

మెదక్‌–అక్కన్నపేట వరకు 17.2 కిలోమీటర్ల రైల్వేలైన్‌ కోసం రూ.205 కోట్లు వ్యయమైందన్నారు. 
మెదక్‌ నుంచి రెండు ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌–ముంబై ట్రాక్‌కు కనెక్ట్‌ చేస్తారని చెప్పారు. 

Hockey India అధ్యక్షుడిగా దిలీప్‌ తిర్కీ కి పగ్గాలు

 

భారత హాకీ సమాఖ్య (హాకీ ఇండియా – హెచ్‌ఐ)కు తొలిసారి ఒక ఆటగాడు అధ్యక్షుడయ్యాడు. భారత్‌ తరఫున 412 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దిగ్గజం, మాజీ కెప్టెన్‌  దిలీప్‌ తిర్కీ ఏకగ్రీవంగా ఎంపికయ్యాడు. తిర్కీకి పోటీగా మరెవరూ బరిలో నిలవకపోవడంతో పోటీ లేకుండా ఈ మాజీ ఆటగాడికి అధ్యక్షుడయ్యే అవకాశం లభించింది. అధ్యక్ష పదవికి తుది ఫలితాలు అక్టోబర్‌ 1న రావాల్సి ఉన్నా... పోటీకి దిగిన రాకేశ్‌ కట్యాల్, భోలానాథ్‌ సింగ్‌ సెప్టెంబర్ 23న తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తిర్కీ ఎంపికను ప్రకటించారు. ప్రపంచ హాకీ అత్యుత్తమ డిఫెండర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన 44 ఏళ్ల తిర్కీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) లాంఛనంగా ఆమోదించింది. మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న తిర్కీ అర్జున, పద్మశ్రీ అవార్డులు అందుకున్నాడు. ఏ దేశం తరఫునైనా 400 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా తిర్కీ గుర్తింపు పొందాడు. 

Also read: IPL 2023 :మళ్లీ ఈ ఫార్మాట్‌లోనే ఐపీఎల్‌ .. : సౌరవ్‌ గంగూలీ

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మరోసారి హరీశ్‌రావు 

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా 2వ సారి ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు, ఉపాధ్యక్షుడిగా అశ్వినీ మార్గం, కార్యదర్శిగా సాయినాథ్‌ దయాకర్‌ శాస్త్రి, సంయుక్త కార్యదర్శి వనం సురేందర్, కోశాధికారిగా పాపయ్య చక్రవర్తితోపాటు మరో ఏడుగురు మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా నామినేషన్‌ దాఖలు చేయగా, పోటీగా మరెవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. కొత్త కమిటీని 30న ఎగ్జిబిషన్‌ సొసైటీ అధికారికంగా ప్రకటించనుంది.  

Also read:RYTHU BIMA: రైతు బీమాకు రూ. 1,450 కోట్లు.. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున చెల్లింపు

Andhra University: మధుమేహ వ్యాధిని గుర్తించేందుకు AU అద్భుత ఆవిష్కరణ.. ఒక స్ట్రిప్‌ ఆరు నెలల వినియోగం  

మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్‌ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్‌–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్‌ నానో బయోసెన్సార్‌ పరికరాన్ని ఆవిష్కరించింది.

Also read: MCED blood test: క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్‌ చేంజర్‌

ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్‌ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్‌ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్‌ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్‌ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు. ఈ బయోసెన్సార్‌ పరికరంలో ఒక చుక్క బ్లడ్‌ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే షుగర్‌ లెవల్స్‌ వివరాలు డిస్‌ప్లే అవుతాయి. 

Also read: Gogo Rock Formation: ఈ గుండె వయసు... 38 కోట్ల ఏళ్లు!

మరోవైపు ఈ డివైజ్‌ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్‌ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్‌ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్‌ మెథడ్‌ ద్వారా చిప్స్‌ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్‌ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్‌ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి.  

Also read: Telangana History Important Bitbank in Telugu: సముద్రగుప్తుడికి సమకాలీకుడైన వాకాటక రాజు ఎవ‌రు?

ఏయూ చరిత్రలో తొలి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ 
ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్‌ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్‌ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.  

Also read: Quiz of The Day (September 23, 2022): అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 24 Sep 2022 06:10PM

Photo Stories