Skip to main content

Global Investors Summit: 20 రంగాల్లో 6 లక్షల ఉద్యోగా­లు.. ఎలాంటి స‌హ‌కారానికైనా ఒక్క ఫోన్‌కాల్ చేయండి

భూమి, నీరు, సముద్రతీరం, విస్తారమైన ఖనిజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతరత్రా ప్రకృతి వనరులు.. వీటన్నింటికీ తోడు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
YS Jagan, mukesh ambani

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగా­వకాశాలు రానున్నాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 తొలి రోజు శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారి­శ్రా­మిక దిగ్గజాలు హాజరైన ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లా­డారు.

తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నామని, వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మిగిలిన 248 ఎంవోయూలను శనివారం కుదుర్చుకుంటామని, వాటి విలువ రూ.1.15 లక్షల కోట్లు అని తెలిపారు. వాటితో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

రిలయెన్స్‌ గ్రూప్, అదాని గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్‌ గ్రూప్, మోండలెజ్, పార్లే, శ్రీ సిమెంట్స్‌ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారాన్ని విస్తరించనున్నాయని చెప్పారు.

రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సహకారం అందించేందుకునైనా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే ఉంటుందని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఏ విధంగా అనుకూలమో ఆయన వారికి స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఎన్నెన్నో అనుకూలతలు
ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్‌ జోన్, ప్రముఖ పర్యాటక కేంద్రాలతో ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం బలమైన ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. జీ–20 దేశాల వర్కింగ్‌ కమిటీ సమావేశాలకు కూడా ఇదే విశాఖ మార్చి చివరి వారంలో ఆతిథ్యం ఇవ్వనుంది.

సమృద్ధిగా సహజ వనరులు, ఉన్నత విద్యా సంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు సానుకూలతలు. వీటికి తోడు పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు పటిష్ట కార్యాచరణతో అడుగులు ముందుకు వేసేందుకు చురుకైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. 

మూల స్తంభాలుగా 4 అంశాలు గ్రీనిఫికేషన్‌ 
సంప్రదా­యేతర ఇంధనం దిశగా వ్యవస్థను మార్చడంపై ప్రధానంగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్రంలో 82 గిగావాట్ల సంప్రదా­యేతర ఇంధన ఉత్పత్తిని సాధించడానికి అవకాశాలు­న్నాయి. సోలార్, విండ్, పంప్డ్‌ స్టోరేజీ.. ఈ మూడు రకాల ఇంధనాలు సమ్మిళితంగా పొందడానికి అవకాశాలున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవసరమైన ల్యాండ్‌ పార్సిళ్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నందున 34 గివావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. 24 గంటలపాటు ఈ ప్రాజెక్ట్‌ నుంచి సంప్రదాయేతర ఇంధనాన్ని పొందవచ్చును. అతిపెద్ద తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి.

పారిశ్రామిక లాజిస్టిక్స్, మౌలిక వసతులు
ఈ విషయంలో భారతదేశానికి తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్‌  గేట్‌వే గా ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్ర రవాణా రంగంలో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా రామాయపట్నం, మచిలీ­పట్నం, కాకినాడ, భావనపా­డులలో కొత్త పోర్టులు నిర్మి­స్తున్నాం. ఇప్పటికే కార్యక­లాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. ఈ పోర్టుల సమీపంలో పారి­శ్రామికీకరణకు అపార అవకాశా­లున్నాయి.

మూడు పారిశ్రామిక కారిడార్లు.. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు వస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. పారిశ్రామికంగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఈ కారిడార్లు ఉన్నాయి. వీటికి పోర్టులతో అద్భుతమైన రవాణా అనుసంధానం ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 10 నోడ్స్‌ పారిశ్రామిక హబ్‌లుగా తయారవుతున్నాయి.

సరుకు రవాణా సమయాన్ని, వ్యయాన్ని ఆదా చేయడానికి రాష్ట్రంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీ మోడల్‌ పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులను పెంచడానికి ప్రాసెసింగ్‌ కోసం కొత్తగా 9 హార్బర్లను  నిర్మిస్తున్నాం. వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా ఉన్నాయి.

ఫార్మా­స్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలకు నిర్దిష్టంగా క్లస్టర్లు ఉన్నాయి. అవి చక్కటి మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అందిస్తున్నాయి. మెడ్‌టెక్‌ కంపెనీలకు ఏపీ పుట్టిల్లు. విశాఖ­పట్నం మెడ్‌టెక్‌ జోన్‌లో అనేక కంపెనీలు తమ కార్యక­లాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రంగంలో మరింత వృద్ధి కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పి­స్తున్నాం. దాంతో సమయం, వ్యయం ఆదా అవుతుంది.

Published date : 04 Mar 2023 11:38AM

Photo Stories