Asia Largest Tulip Garden: ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది? దేశ, విదేశాల నుంచి పర్యాటకులు..
ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్. ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ప్రతియేటా వసంత రుతువులో తులిప్ పుష్పాలు వికసించే సమయంలో..ఈ గార్డెన్‌ను పర్యాటకుల కోసం అధికారులు తెరుస్తుంటారు.ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. తులిప్ గార్డెన్‌ను చూసేందుకు ప్రతి ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు.
ఈ ఏడాది మార్చి 23 నుంచి తులిప్ ఫెస్టివల్ జరగనుంది.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు.
తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్‌లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు.
కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు.