Global Investors Summit: దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం ఏపీ: సీఎం వైఎస్ జగన్
దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్ పోర్టల్ సేవలను అందిస్తోంది. 23 విభాగాల్లో 90 రకాల వ్యాపార సేవలు ఈ పోర్టల్‌లో లభిస్తున్నాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి గరిష్టంగా 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం.
గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 రకాల సేవలను అందిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా ఏపీదే మొదటి స్థానం. పరిశ్రమలు పెట్టేవారికి అత్యంత అనుకూలంగా ఉండటం కోసం కొన్ని చట్టాలను సవరించడం, తొలగించడం చేశాం.
ఎంటర్‌ప్రైజస్, స్కిల్ డెవలప్‌మెంట్
పారిశ్రామికంగా నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి మంచి మౌలిక వసతులు, సానుకూల వ్యాపార వాతావరణంతోపాటు నైపుణ్యమైన మానవ వనరులు అత్యంత కీలకం. ఈ దిశగా 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం పారిశ్రామిక సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం.
- 2021–22లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్ధి రేటు సాధించింది. గత మూడేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు కూడా వృద్ధి చెందాయి. సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 9.3 శాతంగా నమోదైంది.
- సుస్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో 2020–21కి ఇచ్చిన ఎస్‌జీడీ ఇండియా ఇండెక్స్ ర్యాంకుల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.
- క్షేత్ర స్థాయి నుంచి పరిపాలనను బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు పలు చర్యలు తీసుకుంది.
త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం
అందమైన విశాఖపట్నంలో అద్భుతమైన సమయాన్ని గడపాలని కోరుతున్నాను. విశాఖపట్నం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. నేనూ త్వరలోనే ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నా. త్వరలోనే అది సాకారం అవుతుంది.