AP News: కనిపించని పెద్దపులి జాడ... కూనలను తరలించిన అధికారులు
Sakshi Education
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయంలో ఉంచిన ఉన్న నాలుగు పులి కూనలను గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జువాలాజికల్ పార్కుకు తరలించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు నాగార్జున సాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తల్లితో పులి కూనలను కలిపేందుకు నాలుగు రోజులపాటు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పులి కూనల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జూ పార్క్‌కు తరలించారు.
పులి కూనల ఆరోగ్యం భేష్
తల్లి పులి బతికే ఉందని నిర్ధారణ కావడం, పులి కూనలు కూడా ఆరోగ్యంగా చలాకీగా ఉండటం సంతోషకరమని నాగార్జునసాగర్–శ్రీశైలం ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి చెప్పారు. తిరుపతిలో జూపార్క్‌కు అనుబంధంగా ఉన్న అడవిలో పులి కూనలను పెంచుతామన్నారు.
ఎంత గాలించినా...
కొంత వయసు వచ్చాక వేటలో తర్ఫీదునిచ్చి తిరిగి అడవిలో ప్రవేశ పెడతామని చెప్పారు. ఇదిలావుండగా.. పులి పాదముద్రలు కనిపించాయని కొందరు చెప్పగా.. ఆ ప్రదేశానికి గురువారం తెల్లవారుజామున పులి కూనలను తరలించారు. కూనల అరుపులతో కూడిన రికార్డింగ్స్‌ను వినిపిస్తూ.. తెల్లవారే వరకు ఎదురు చూసినా తల్లి పులి జాడ కనిపించలేదు.
Published date : 10 Mar 2023 07:12PM