Nobel Prize: భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం–2021
వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు 2021 ఏడాది భౌతికశాస్త్ర నోబెల్ అవార్డును స్యూకోరో మనాబే (90), క్లాస్ హాసెల్‌మాన్ (89), జియోర్గియో పరిసీ (73) అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉన్న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ విషయాన్ని అక్టోబర్ 5న ప్రకటించింది. అవార్డు కింద అందే నగదు బహుమతి 11 లక్షల డాలర్లలో సగం పరిసీ దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని స్యూకోరో, క్లాస్‌లు చెరిసగం పంచుకుంటారని తెలిపింది. మానవ చర్యలు భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునేందకు స్యూకోరో, క్లాస్ పునాదులేయగా... సంక్లిష్ట వ్యవస్థల్లోనూ ఒక పద్దతిని కనుక్కునేందుకు పరిసీ సహకరించారు.
స్యూకోరో మనాబే...
జపాన్‌లోని షింగోలో జన్మించిన స్యూకోరో ప్రస్తుతం అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో సీనియర్ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వందలాది అంశాల ఆధారంగా పనిచేసే భూ వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు 1960లలోనే ప్రయోగాలు చేశారు. వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువైతే భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయన్నది ప్రయోగపూర్వకంగా రుజువు చేశారు. భూ వాతావరణానికి సంబంధించిన భౌతిక నమూనాలను సిద్ధం చేశారు. రేడియేషన్ సమతౌల్యం; గాలి కదలికల మధ్య చర్యలను తొలిసారిగా పరిశోధించారు. ఆయన కృషి ప్రస్తుతం వాతవరణాన్ని అంచనా వేసేందుకు అవసరమైన క్లైమెట్ మోడల్స్ సిద్ధమయ్యాయి.
క్లాస్ హాసెల్‌మాన్....
జర్మనీలోని హాంబర్గ్‌లో జన్మించిన క్లాస్ ప్రస్తుతం హాంబర్గ్‌లోని మ్యాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీటిరియాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. స్థానిక వాతావరణం, ప్రపంచం మొత్తమ్మీది వాతావరణాలకు మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఓ మోడల్‌ను తయారు చేశారు. తద్వారా స్థానిక వాతావరణంలో ఎంత గందరగోళంగా ఉన్నా ప్రపంచ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో క్లైమెట్ మోడల్స్ ఎలా నమ్మదగ్గవో క్లాస్ హాసెల్‌మాన్ మోడల్ ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతుల వల్ల వాతావరణంలోకి కార్బన్‌డైయాక్సైడ్ ఎక్కువగా చేరడం వంటి మానవ చర్యల వల్ల భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతోందని (భూతాపోన్నతి) రుజువు చేయడం వీలైంది.
జియోర్గియో పరిసీ...
ఇటలీలోని రోమ్‌లో జన్మించిన పరిసీ... రోమ్‌లోని సాపియోంజా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గణితం, జీవశాస్త్రం, నాడీ శాస్త్రం, మెషీన్ లెర్నింగ్ వంటి అనేక సంక్లిష్ట వ్యవస్థలను అర్థం చేసుకునేందుకు పరిసీ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో చాలా అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒక పద్ధతిని అనుసరించకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపించినా.. అంతర్గతంలో వాటిల్లోనూ ఒక క్రమపద్ధతి ఉంటుందని గుర్తించారు జియోర్గియో పరిసీ.
చదవండి: భౌతికశాస్త్ర నోబెల్ అవార్డు-2020
క్విక్ రివ్యూ :
ఏమిటి : భౌతికశాస్త్ర నోబెల్ పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : స్యూకోరో మనాబే (జపాన్), క్లాస్ హాసెల్‌మాన్ (జర్మనీ), జియోర్గియో పరిసీ (ఇటలీ)
ఎందుకు : వాతావరణం వంటి అత్యంత సంక్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడే పరిశోధనలు చేసినందుకు....
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.