భౌతికశాస్త్ర నోబెల్ అవార్డు-2020
అవార్డు కింద అందే నగదు బహుమతిలో సగం పెన్‌రోజ్‌కు దక్కనుండగా మిగిలిన సగం మొత్తాన్ని గెంజెల్, గేజ్‌లు చెరిసగం పంచుకుంటారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ 2020, అక్టోబర్ 6న ప్రకటించింది.
వాస్తవిక ప్రపంచంలోనూ భాగం...
కృష్ణబిలం ఏర్పడటం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి ప్రబల ఉదాహరణ అని గుర్తించినందుకు పెన్‌రోజ్‌కు అవార్డు లభించింది. మన పాలపుంత మధ్యలో అతి భారయుతమైన, తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించిన ఖగోళ వస్తువును గుర్తించి నందుకుగాను రైన్‌హార్డ్ గెంజెల్, ఆండ్రియా గేజ్‌లకు అవార్డు దక్కింది. ఒకప్పుడు కేవలం కాల్పినిక కథలకు మాత్రమే పరిమితమైన కృష్ణ బిలాలు వాస్తవిక ప్రపంచంలోనూ భాగమని ఈ ముగ్గురి పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయని అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కే హాన్సన్ పేర్కొన్నారు.
సూర్యుడికి 40 లక్షల రెట్లు...
బ్రిటన్ శాస్త్రవేత్త రోజర్ పెన్‌రోజ్ గణిత శాస్త్రం ఆధారంగా కృష్ణ బిలాలు ఏర్పడే అవకాశాలను రూఢి చేశారు. గెంజెల్, గేజ్‌లు ఇరువురు మన పాలపుంత మధ్యభాగంలో దుమ్ముతో కూడిన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పలు నక్షత్రాలు తిరుగుతున్నప్పటికీ వర్ణించేందుకు వీలుకాని సంఘటనలు ఏవో చోటు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. తదుపరి పరిశోధనల ద్వారా ఆ ప్రాంతం ఓ భారీ కృష్ణబిలమని మన సూర్యుడికి 40 లక్షల రెట్లు ఎక్కువ బరువు ఉందని గుర్తించారు.
విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం పేరు?
- విశాల విశ్వంలో అక్కడక్కడ ఉండే అదృశ్య ప్రాంతాలు. కంటికి కనిపించవు సరికదా.. చుట్టూఉన్న ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఇవి ఎంతటి శక్తిమంతమైనవి అంటే... విశ్వంలోనే అత్యంత వేగంగా ప్రయాణించగల కాంతిని కూడా తమలో కలిపేసుకోగలవు.
- సూర్యుడి లాంటి భారీ నక్షత్రాలు తమలోని ఇంధనం మొత్తాన్ని ఖర్చు పెట్టేసిన తరువాత తమలో తాము కుప్పకూలిపోతూ కృష్ణబిలాలుగా మారతాయని అంచనా.
- పాలపుంతలతోపాటే కృష్ణబిలాలు కూడా ఏర్పడతాయని శాస్త్రవేత్తల అంచనా.
- కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఐన్‌స్టీన్ తరువాత అంతటి వాడుగా ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా ప్రకారం... కృష్ణబిలాల్లోకి ప్రవేశించిన పదార్థం అన్ని వైపుల నుంచి లాగబడుతుంది. దీన్నే హాకింగ్ స్పాగెటిఫికేషన్ అని పిలిచారు. కృష్ణ బిలానికి ఆవల ఏముందో కూడా ఎవరికీ తెలియదు.
- 1960లో జాన్ ఆర్చీబాల్డ్ వీలర్ కృష్ణ బిలాలకు ఆ పేరు పెట్టారు.
- ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన తొట్టతొలి కృష్ణబిలం పేరు సైగ్నస్ ఎక్స్-1.
- సూర్యుడు.. ఇంధనమంతాఖర్చయిపోయి కుప్పకూలిపోయినా కృష్ణబిలంగా మారేంత పెద్దది కాదు.
- భూమికి అతిదగ్గరగా ఉన్న కృష్ణబిలం పేరు వీ616 మోనోసెరోటిస్. దాదాపు మూడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది.
- విశ్వంలో అతి పెద్ద కృష్ణబిలం ఎన్‌జీసీ 4889. నిద్రాణంగా ఉన్న ఈ కృష్ణబిలం ఎప్పుడు చైతన్యవంతమై చుట్టూ ఉన్న దుమ్ము ధూళి, కాంతులను లయం చేసుకుంటుందో ఎవరికీ తెలియదు.
- సౌర కుటుంబం ఉన్న పాలపుంత మధ్యలో ఉన్న అతి భారీ కృష్ణబిలం పేరు ‘సాగిటరియస్ -ఏ’. 40 లక్షల సూర్యుళ్లు ఒక్కదగ్గర చేరితే ఉండేంత బరువు ఉంటుంది ఇది. భూమికి 27 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భౌతికశాస్త్ర నోబెల్-2020 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : రోజర్ పెన్‌రోజ్(బ్రిటన్), రైన్‌హార్డ్ గెంజెల్(జర్మనీ), ఆండ్రియా గేజ్(అమెరికా)
ఎందుకు : కృష్ణ బిలాలపై చేసిన పరిశోధనకు