Nobel Prize: నోబెల్ శాంతి పురస్కారం–2021
ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పాత్రికేయ గళానికి ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఫిలిప్పీన్స్‌కి చెందిన మహిళా జర్నలిస్టు మరియా రెస్సా, రష్యాకు చెందిన దిమిత్రీ మురటోవ్‌లకు సంయుక్తంగా 2021 ఏడాది నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇస్తున్నట్టుగా అక్టోబర్ 8న నార్వే రాజధాని ఓస్లోలోని నార్వే నోబెల్ ఇన్‌స్టిస్ట్యూట్ ప్రకటించింది. శాంతి బహుమతి కింద స్వర్ణపతకంతో పాటుగా 11.4 లక్షల డాలర్ల నగదు పురస్కారం విజేతలకు లభిస్తుంది. రెస్సా, దిమిత్రీ ధైర్యసాహసాలతో పోరాడుతున్నారని నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ ఉమన్ బెరిట్ రీస్ ఆండర్సన్ ప్రశంసించారు.
ప్రభుత్వ వ్యతిరేక గళం...
ఫిలిప్పీన్స్‌కి చెందిన మహిళా జర్నలిస్టు మరియా రెస్సా (58) 2012లో రాప్లర్ అనే వెబ్‌సైట్‌ని స్థాపించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్’ కార్యక్రమంపై ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్ మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు. వీటిపై కథనాలను ప్రచురించిన రెస్సాపై ఎన్నో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో ఆరేళ్ల కారాగార శిక్ష పడింది. బెయిల్‌పై బయటకొచ్చిన ఆమె తన కేసులపైన కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
దశాబ్దాలుగా పోరాటం..
రష్యాకి చెందిన పాత్రికేయుడు దిమిత్రీ మురటోవ్ 1993లో స్థాపించిన నొవయా గజెటా అనే పత్రిక వ్యవస్థాపకుల్లో ఒకరు. ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను నొవయా ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. నొవయా పత్రికకి సేవలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రఖ్యాత జర్నలిస్టు అన్నా పొలిట్‌కోవస్క్య సహా ఆరుగురు పాత్రికేయులకు సగం పురస్కారం ఇస్తున్నట్టుగా దిమిత్రీ ప్రకటించారు.
చదవండి: నోబెల్ శాంతి బహుమతి-2020
క్విక్ రివ్యూ :
ఏమిటి : నోబెల్ శాంతి పురస్కారం–2021 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : జర్నలిస్టులు మరియా రెస్సా(ఫిలిప్పీన్స్), దిమిత్రీ మురటోవ్(రష్యా)
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్