Skip to main content

International Film Festival: అవార్డు ప్ర‌దానం.. ఈ సంద‌ర్భంగా చిరంజీవి ఏమ‌న్నారంటే..

గోవాలో జరుగుతున్న 53వ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)’ ముగింపు వేడుకకి సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి హాజరయ్యారు.

ఈ వేదికపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చేతుల మీదుగా ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – 2022’ పురస్కారాన్ని ఆయ‌న‌ అందుకున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘మన తెలుగు ప్రేక్షకులు, తెలుగు అభిమానులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి ప్రేమకు నేను దాసోహం.. వాళ్ల ప్రేమకు నేను దాసుణ్ని. ఆ ప్రేమ కావాలి.. ఆ ప్రేమే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. ఇలాంటి గొప్ప అవార్డులు పొందేందుకు అవకాశం కల్పించింది. మీకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను’’ అని చిరంజీవి అన్నారు. 
‘‘ఈ అవార్డును ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీగారికి థ్యాంక్స్‌. ఈ క్షణం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు నాకే కాదు.. నా ఫ్యాన్స్‌లోనూ ఎంతో ఉత్సాహం నింపింది. శివశంకర్‌ వరప్రసాద్‌గా మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన నాకు చిత్ర పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో ఉన్నాను. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల కొన్నేళ్లు గ్యాప్‌ వచ్చింది. ఆ సమయంలో సినిమా విలువ ఏంటో తెలిసింది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రేక్షకులు ఎప్పటిలానే నాపై ప్రేమను చూపారు. నా చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తాను. అవినీతి లేని ఏకైక రంగం సినిమా రంగం. ఇక్కడికి ఎవరైనా రావొచ్చు. ప్రతిభ ఒక్కటే కొలమానం. నాకు యువ హీరోలు పోటీ కాదు.. నేనే వాళ్లకు పోటీ.. వాళ్లకు ఇప్పడు కష్టకాలమే (నవ్వుతూ). గతంలో ఇలాంటి వేడుకలో పాల్గొన్నప్పుడు అక్కడ దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేకపోవడంతో చాలా బాధపడ్డాను. కానీ, ఇప్పుడు ప్రాంతీయ భేదాలు తొలగిపోయి భారతీయ సినిమా అనే రోజు రావడం హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో మన భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలి’’ అన్నారు. 

➤ నటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది అవార్డు

Published date : 29 Nov 2022 01:53PM

Photo Stories