Guinness Book of Records: గిన్నిస్ బుక్ రికార్డులో చిన్నారులు..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో భారత అకాడమి ఆధ్వర్యంలో డిసెంబర్ 24(ఆదివారం) రాత్రి ఒకేసారి 3,783 మంది కళాకారులు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారని శిక్షకుడు మిట్టు దత్తు తెలిపారు. జనుత శబ్దం అనే అంశంపై ఏడు నిమిషాల పాటు నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావుల చేతుల మీదుగా గిన్నిస్ బుక్ రికార్డు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. చిన్నారులు గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాధించుకోవడంపై పలువురు అభినందనలు తెలిపారు.
గిన్నిస్ రికార్డ్‌లో నిర్మల్ కళాకారులు
తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి లెసన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకి ఎక్కింది. ఏకకాలంలో 3,783 మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి కళావైభవాన్ని ప్రపంచానికి చాటారు. డిసెంబర్ 24(ఆదివారం) రాత్రి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచిపూడి డ్యాన్స్ ప్రదర్శించారు. స్టేడియం నలుమూలలు ఏడు నిమిషాల పాటు కళాకారులు నృత్యం చేస్తూ అలరించారు. ఇందులో నిర్మల్‌లోని స్వరూపిణి నృత్య కళాక్షేత్రం నుంచి 65మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రియదర్శినినగర్‌కు చెందిన బచ్చు కల్యాణి, ప్రసాద్‌ల కుమార్తె బచ్చు మనస్విని సైతం పాల్గొని పురస్కారాన్ని అందుకుంది.
ముధోల్ చిన్నారి..
ముధోల్‌లోని బ్రాహ్మణ్ గల్లీకి చెందిన భుజంగం నాగేష్‌కుమార్–సరితరాణి దంపతుల కూతురు వరణ్య కూడా కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. మూడో తరగతి చదువుతున్న తమ కూతురు గిన్నిస్‌రికార్డులో భాగస్వామి కావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.