Skip to main content

Nobel Prize: సాహిత్య నోబెల్‌ పురస్కారం–2021

Abdul Razak Gurna

శరణార్థుల కన్నీళ్ల కథల్ని అక్షరబద్ధం చేసిన టాంజానియా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నా(73)కు 2021 ఏడాది సాహితీ నోబెల్‌ పురస్కారం లభించింది. వలసవాదంపై పోరాటం చేస్తూనే, శరణార్థుల సమస్యల్ని కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించినందుకుగాను ఆయనకు ఈ అవార్డును ఇస్తున్నట్టుగా స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సెన్సైస్‌ అక్టోబర్‌ 6న ప్రకటించింది. పురస్కారం కింద అబ్దుల్‌కు 11 లక్షల డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది. 1986లో వోల్‌ సోయింకా తర్వాత ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నల్ల జాతి ఆఫ్రికన్‌గా అబ్దుల్‌ గుర్తింపు పొందారు. ఆఫ్రికాలో జన్మించిన రచయిత ఒకరికి నోబెల్‌ రావడం ఇది ఆరోసారి. ఇటీవల యూకేలోని కెంట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసిన అబ్దుల్‌... తనకు వచ్చిన నోబెల్‌ పురస్కారాన్ని ఆఫ్రికాకు, ఆఫ్రికన్లకు, పాఠకులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు.

ఒక శరణార్థి...

1948, డిసెంబర్‌ 20న హిందూమహాసముద్రంలోని జంజీబార్‌ ద్వీపంలో అబ్దుల్‌ రజాక్‌ గుర్నా జన్మించారు. బ్రిటీష్‌ వలస పాలనలో ఉండే ఈ ద్వీపం 1964లో స్వాతంత్య్రం పొంది టాంజానియాలో భాగంగా మారింది. అయితే అక్కడ అశాంతి ప్రజ్వరిల్లడంతో ఆయన 1968లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. స్వయంగా ఒక శరణార్థి  అయిన అబ్దుల్‌... శరణార్థులకు ఎదురయ్యే చేదు అనుభవాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూశారు.

 

శరణార్థుల వ్యథలే కథా వస్తువుగా....

21 ఏళ్ల వయసులోనే కలం పట్టిన అబ్దుల్‌... శరణార్థులకి మద్దతుగా పోరాటం చేస్తూ వారి కన్నీటి కథల్ని అక్షరబద్ధం చేశారు. మొత్తం 10 నవలలు, లెక్కకు మించి చిన్న  కథలు రాశారు. శరణార్థుల వ్యథలనే కథా వస్తువుగా తీసుకున్నప్పటికీ ఆ రచనల్లో ఖండాలు, దేశాల, సంస్కృతుల మధ్య ఉన్న తేడాలు, జీవన వైవిధ్యాలు.. అంతర్లీనంగా ప్రేమ, దుఃఖం, ఆవేదన, ఆక్రోశం వంటి వివిధ భావాల సమ్మేళనంగా సాగాయి. ఆయన రచనల్లో మెమొరీ ఆఫ్‌ డిపార్చర్, పిలిగ్రిమ్స్‌ వే, ప్యారడైజ్, బై ది సీ, డిజర్షన్‌ నవలలు ప్రసిద్ధి పొందాయి. ప్యారడైజ్‌ నవల 1994లో బుకర్‌ప్రైజ్‌ షార్ట్‌లిస్టులో అర్హత సంపాదించింది. అబ్దుల్‌ మాతృభాష స్వహిలి అయినప్పటీకి రచనలు మాత్రం ఆంగ్లంలో సాగాయి.

 

అబ్దుల్‌ రజాక్‌ గుర్నా రచించిన పుస్తకాలు

  • మెమొరీ ఆఫ్‌ డిపార్చర్‌(1987)
  • పిలిగ్రిమ్స్‌ వే(1988)
  • డాటీ(1990)
  • పారడైజ్‌(1994)
  • అడ్మైరింగ్‌ సైలెన్స్‌(1996)
  • బై ది సీ(2001)
  • డిజర్షన్‌(2005)
  • ది లాస్ట్‌ గిఫ్ట్‌(2011)
  • గ్రేవల్‌ హార్ట్‌(2017)
  • ఆఫ్టర్‌ లైవ్స్‌(2020)

చ‌ద‌వండి: సాహిత్య నోబెల్ పురస్కారం-2020

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సాహిత్య నోబెల్‌ పురస్కారం–2021 విజేత
ఎప్పుడు : అక్టోబర్‌ 7
ఎవరు    : అబ్దుల్‌ రజాక్‌ గుర్నా(73) 
ఎందుకు : వలసవాదంపై పోరాటం చేస్తూనే, శరణార్థుల సమస్యల్ని కళ్లకు కట్టినట్టుగా ఆవిష్కరించినందుకుగాను...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌


డౌన్‌లోడ్‌ వయా ఆపిల్‌ ఐ స్టోర్‌

Published date : 08 Oct 2021 03:41PM

Photo Stories