Skip to main content

సాహిత్య నోబెల్ పురస్కారం-2020

తన కవితలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్‌కు 2020 ఏడాది సాహితీ నోబెల్ పురస్కారం లభించింది.

‘గ్లుక్ తన కవితల్లో.. కుటుంబ జీవితంలోని కష్టానష్టాలను సైతం హాస్యం, చమత్కారం కలగలిపి చెప్పారు’ అందుకే ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని నోబెల్ అవార్డు కమిటీ అక్టోబర్ 8న ప్రకటించింది. 2006లో గ్లుక్ రచించిన ‘అవెర్నో’ కవితా సంకలనం అత్యుత్తమమైందని నోబెల్ సాహిత్య కమిటీ చైర్మన్ ఆండెర్స్ ఒల్సన్ పేర్కొన్నారు. స్వీడిష్ అకాడమీ ఈ బహుమానం కింద గ్లుక్‌కు రూ.8.25 కోట్ల (10 మిలియన్ క్రోనార్లు)తోపాటు ప్రశంసా పత్రం అందజేయనుంది. 1991 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు.

ఫస్ట్‌బోర్న్ పేరుతో తొలి కవిత...
హంగేరియన్-యూదు మూలాలున్న లూయిసీ గ్లుక్ 1943, ఏప్రిల్ 22న న్యూయార్క్‌లో జన్మించారు. కనెక్టికట్‌లోని యేల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. 1968లో ‘ఫస్ట్‌బోర్న్’ పేరుతో మొట్టమొదటి కవిత రాసిన ఆమె అతి తక్కువ కాలంలోనే సమకాలీన అమెరికా సాహిత్యంలో ప్రముఖ కవయిత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఆరు దశాబ్దాల్లో డిసెండింగ్ ఫిగర్స్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్స్, అరారట్ వంటి 12 కవితా సంకలనాలను, రెండు వ్యాస సంకలనాలను గ్లుక్ రచించారు.

లూయిసీకి దక్కిన పురస్కారాలు

  • నేషనల్ హ్యుమానిటీ మెడల్(2015)
  • అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్‌‌ట్స అండ్ లెటర్స్ గోల్డ్ మెడల్
  • ‘ది వైల్డ్ ఐరిస్’ కవితకు పులిట్జర్ ప్రైజ్(1993)
  • ‘ఫెయిత్‌ఫుల్ అండ్ విర్చువస్ నైట్’ కవితకు నేషనల్ బుక్ అవార్డు(2014)
  • 2003, 2004 సంవత్సరాల్లో ‘యూఎస్ పోయెట్ లారియేట్’


వివాదాల్లో నోబెల్ సాహిత్యం’

  • సాహిత్యంలో నోబెల్ బహుమతులపై ఇటీవల వివాదాలు, కుంభకోణాలు అలుముకోవడంతో పాటు పాశ్చాత్య దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
  • నోబెల్ ఎంపిక కమిటీపై 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు కమిటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆ ఏడాది నోబెల్ సాహిత్యం పురస్కారాన్ని ప్రకటించలేదు.
  • 2019 ఏడాది సాహిత్య నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది.
  • 2018వ సంవత్సరానికి గాను పోలండ్‌కు చెందిన ఓల్గా టోకార్జక్‌కు, 2019కి ఆస్ట్రియా రచయిత్రి పీటర్ హాండ్కేకు అవార్డులు అందజేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
  • హాండ్కే ఎంపికపై వివాదం తలెత్తింది. 1990లలో జరిగిన బాల్కన్ యుద్ధాల్లో హాండ్కే సెర్బుల మద్దతుదారుగా ఉన్నారని, సెర్బియా యుద్ధ నేరాలను హాడ్కే సమర్థించారని ఆరోపణలు ఉండటం ఇందుకు కారణం. అల్బేనియా, బోస్నియా, టర్కీ తదితర దేశాలు హాండ్కేకు బహుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించగా కమిటీ సభ్యుడు ఒకరు తన పదవికి రాజీనామా చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : సాహితీ నోబెల్ పురస్కారం-2020 విజేత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్
ఎందుకు : సాహిత్య రంగంలో విశేష కృషి చేసినందుకు
Published date : 08 Oct 2021 03:38PM

Photo Stories