CSE Branch Advantages in Btech : ఇంజనీరింగ్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ తీసుకోవడం ద్వారా.. లాభాలు ఇవే..!
అందుకారణం.. జాబ్ మార్కెట్‌లో సీఎస్‌ఈ విద్యార్థులకు లభిస్తున్న అవకాశాలు, వేతనాలు. భవిష్యత్తులో సీఎస్‌ఈ, ఐటీ విభాగాల్లో.. లక్షల సంఖ్యలో కొలువులు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి.
దీంతో డిప్లొమా నుంచి బీటెక్ వరకూ.. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతిష్టాత్మక ఐఐటీల వరకు.. టాప్ ర్యాంకర్ల తొలి ఛాయిస్‌గా నిలుస్తోంది.. సీఎస్‌ఈ! ఈ నేపథ్యంలో.. సీఎస్‌ఈకి క్రేజ్‌కు కారణాలు.. ఈ బ్రాంచ్ ద్వారా లభించే నైపుణ్యాలు, ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలు మొదలైన వాటిపై సమగ్ర సమాచారం మీకోసం..
☛ గత ఐదారేళ్లుగా ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈమెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల టాపర్లు సీఎస్‌ఈ బ్రాంచ్‌ను ఎంచుకుంటున్నారని స్పష్టం చేస్తున్న గణాంకాలు.
☛ ఐఐటీల్లో రెండు వేల లోపు ర్యాంకుతో సీఎస్‌ఈ సీట్లు భర్తీ అవుతున్నాయి.
ఎన్‌ఐటీల్లోనూ ఆరు వేల నుంచి ఎనిమిది వేల లోపు ర్యాంకుతోనే సీఎస్‌ఈ సీట్లు భర్తీ అయిపోతున్న పరిస్థితి. హోంస్టేట్ కోటాలో మాత్రం సీఎస్‌ఈ బ్రాంచ్ సీట్లు వేయిలోపు ర్యాంకుతోనే భర్తీ అవుతుండడం గమనార్హం.
☛ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్, ఈఏపీసెట్‌లను పరిగణనలోకి తీసుకున్నా.. జనరల్ కేటగిరీలో అయిదు వేల నుంచి ఆరు వేల ర్యాంకుతోనే సీఎస్‌ఈ సీట్లకు అవకాశం.
☛ రాష్ట్ర స్థాయిలో టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 2000లోపు ర్యాంకుతోనే సీఎస్‌ఈ సీట్లు భర్తీ.
☛ డిప్లొమా స్థాయిలోనూ.. పాలిటెక్నిక్‌లో కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు మొగ్గు చూపుతున్న విద్యార్థులు.
అన్ని రంగాలోనూ.. టాప్.. ఈ బ్రాంచ్..
ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ మొదలు సర్వీస్ సెక్టార్ వరకూ.. అన్ని రంగాలు ఆటోమేషన్ బాట పడుతున్నాయి. తమ కార్యకలాపాలను డిజిటల్, ఆన్‌లైన్ రూపంలో అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాలజీ ద్వారా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఈ డిజిటల్ కార్యకలాపాలకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా.. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీలను సైతం అనుసరిస్తున్నాయి. వీటన్నిటినీ సమర్థంగా నిర్వహించాలంటే.. అందుకు అవసరమైన ప్రోగ్రామింగ్, కోడింగ్, నెట్‌వర్కింగ్ తదితర నైపుణ్యాలు అవసరం. ఇవి సీఎస్‌ఈ బ్రాంచ్ విద్యార్థులకు ఉంటాయని భావిస్తూ.. నియామకాల పరంగా వారికి పెద్దపీట వేస్తున్నారు.
ఈ బ్రాంచ్ ద్వారా వచ్చే ఉద్యోగాలు..
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, నాస్‌కామ్, సీఐఐ, వంటి పలు సంస్థల అంచనాల ప్రకారం ఐటీ, సాఫ్ట్‌వేర్ నియామకాలు రానున్న రోజుల్లో లక్షల సంఖ్యలో జరగనున్నాయి. మొత్తం ఐటీ నియామకాల్లో ఆటోమేషన్ ప్రొఫైల్స్‌లోనే దాదాపు యాభై శాతం ఉద్యోగాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనాల ప్రకారం 2028 నాటికి సాఫ్ట్‌వేర్, అనుబంధ విభాగాల్లో అంతర్జాతీయంగా దాదాపు పది బిలియన్ ఉద్యోగాలు లభించనున్నాయి.
నాస్‌కామ్ వర్గాల అంచనా ప్రకారం-2025 నాటికి ఐటీ, ఆటోమేషన్ ప్రొఫైల్స్‌లో మన దేశంలో దాదాపు 30 లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి.
2025 నాటికి ఏటా 13 నుంచి 15 శాతం చొప్పున ఐటీ జాబ్ మార్కెట్‌లో వృద్ధి నమోదవుతుందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ గణాంకాలు కూడా విద్యార్థులు సీఎస్‌ఈ బ్రాంచ్‌వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
ముఖ్యంగా సీఎస్‌ఈ విద్యార్థులు..
ఇండస్ట్రీ వర్గాలు ఆటోమేషన్ బాట పడుతుండడంతో సంబంధిత నైపుణ్యాలను అకడమిక్ స్థాయిలోనే విద్యార్థులకు అందించడానికి ఏఐసీటీఈ నాలుగేళ్ల క్రితమే కరిక్యులంలో మార్పులు చేసింది. ప్రస్తుతం అత్యంత ఆవశ్యకంగా మారుతున్న ఐఓటీ, ఆటోమేషన్ టెక్నాలజీ, బిగ్‌డేటా అనాలిసిస్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలను కూడా బీటెక్ కరిక్యులంలో పొందుపర్చింది. ఎలక్టివ్స్ విధానాన్ని సైతం ప్రవేశపెట్టింది. సీఎస్‌ఈ విద్యార్థులు తమ మేజర్ సబ్జెక్ట్‌తోపాటు మార్కెట్ డిమాండ్ నెలకొన్న ఇతర సబ్జెక్ట్‌ను సైతం అభ్యసించే అవకాశం కల్పించింది.
పలు ఎడ్‌టెక్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా పొందేందుకు చర్యలు తీసుకుంది. ఫలితంగా టైర్-1 మొదలు స్థానిక ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన విద్యార్థులు సైతం ఇండస్ట్రీ వర్గాలకు అవసరమైన తాజా నైపుణ్యాలను పెంచుకోవడానికి మార్గం ఏర్పడింది.
CSEలో అడుగుపెట్టే విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాలు ఇవే..
సీఎస్‌ఈలో అడుగుపెట్టే విద్యార్థులు ముఖ్యంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్‌వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్, డేటా స్ట్రక్చర్స్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. వీటితోపాటు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటున్న కోడింగ్‌పైనా పట్టు సాధించేలా బోధన విధానం అమలవుతోంది. ఫలితంగా.. సీఎస్‌ఈ సర్టిఫికెట్ పొందేనాటికి అభ్యర్థులు జాబ్ రెడీ స్కిల్స్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయాలు, పలు సర్వేల ప్రకారం ఇప్పటికీ సీఎస్‌ఈ విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై పట్టు ఉండట్లేదు. ఈ విషయంలో అకడమిక్ స్థాయిలో మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీఎస్‌ఈలో చేరే విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ స్థాయి అకడమిక్స్ అభ్యసనానికే పరిమితం కాకుండా.. అందుబాటులో ఉన్న ఆన్‌లైన్, మూక్స్ వంటి మార్గాల ద్వారా తాజా నైపుణ్యాలు పెంచుకోవాలి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కార్యకలాపాలకు వెన్నుముక్కగా నిలిచే కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
రూ.30 లక్షల వరకు సగటు వేతనంతో..
సీఎస్‌ఈ బ్రాంచ్ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం విభిన్న ప్రొఫైల్స్‌లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రధానంగా కంప్యూటర్ ప్రోగ్రామర్, సిస్టమ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సిస్టమ్ డిజైనర్, రీసెర్చ్ అనలిస్ట్ తదితర జాబ్స్ ప్రొఫైల్స్ ముందంజలో నిలుస్తున్నాయి. ఏఐ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామర్, రోబోటిక్ ప్రాసెస్ ఇంజనీర్, బ్లాక్ చైన్ డెవలపర్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సంబంధిత విభాగాల్లో నైపుణ్యాలున్న వారికి ఆయా సంస్థలు రూ.8లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వార్షిక వేతనం అందిస్తున్నాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా ఆటోమేషన్ ప్రొఫైల్స్‌లో రూ.30 లక్షల వార్షిక సగటు వేతనంతో కొలువులు ఖరారవుతున్నాయి.
అత్యధిక శాతం మంది విద్యార్థులు..
సీఎస్‌ఈలో చేరేందుకే అత్యధిక శాతం మంది విద్యార్థులు ప్రాధాన్యమిస్తూ.. ఆ బ్రాంచ్‌తో ఏదో ఒక కాలేజ్‌లో చేరదామని ఆశిస్తున్నారు. అకడమిక్‌గా సీఎస్‌ఈ కరిక్యులంపై పట్టు సాధించేందుకు మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ థింకింగ్, క్రిటికల్ ఎవాల్యుయేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, ప్రాబ్లమ్ ఐడెంటిఫైయింగ్ కెపాసిటీ ఉండాలి. అప్పుడే ఈ బ్రాంచ్‌లోని సబ్జెక్ట్‌లను సులువుగా ఆకళింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా తాజా నైపుణ్యాలను వేగంగా నేర్చుకోగలరని నిపుణులు పేర్కొంటున్నారు.
కాలేజీ ఎంపిక ఇలా..
సీఎస్‌ఈలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ఇన్‌స్టిట్యూట్ ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు సదరు కాలేజ్‌ను ఎంచుకునే ముందుకు అక్కడి ఫ్యాకల్టీ, ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్, ఇండస్ట్రీతో కాలేజీకి సంబంధాలు, ప్లేస్‌మెంట్స్ వంటివన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం మేలు. ఒకవేళ తాము ఆశించిన కాలేజ్‌లో సీటు రాని విద్యార్థులు.. తమ భవిష్యత్తు స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ఆన్‌లైన్ లెర్నింగ్ సాధనాలను వినియోగించుకోవాలని పేర్కొంటున్నారు.
☛ Engineering: ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎక్కువ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి? ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులేంటి?
☛ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టాపర్ల తొలి ఛాయిస్‌గా నిలుస్తున్న సీఎస్‌ఈ.
ఐఐటీల్లో మూడు వేల లోపు ర్యాంకుతోనే భర్తీ అవుతున్న సీఎస్‌ఈ బ్రాంచ్ సీట్లు
☛ రాష్ట్ర స్థాయిలోనూ క్యాంపస్ కళాశాలల్లో రెండు వేల లోపు ర్యాంకు సీఎస్‌ఈ సీట్ల భర్తీ
☛ జాబ్ మార్కెట్‌లో సీఎస్‌ఈ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీలు.
☛ 2025 నాటికి ఐటీ, ఆటోమేషన్ ప్రొఫైల్స్‌లో మన దేశంలో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా.
☛ ఆటోమేషన్ ప్రొఫైల్స్‌లో విద్యార్థులు చదివిన ఇన్‌స్టిట్యూట్ ఆధారంగా రూ.8 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు సగటు వార్షిక వేతనం.
☛ కోర్ నైపుణ్యాలతోపాటు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత
ఈ బ్రాంచ్‌లో చేరితే రాణించడం ఎలా..?
సీఎస్‌ఈలో చేరే విద్యార్థులు స్వీయ దృక్పథానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. జాబ్ మార్కెట్ డిమాండ్‌ను లేదా ఇతరుల ఒత్తిడి కారణంగా ఆసక్తి లేకపోయినా ఈ బ్రాంచ్‌లో చేరితే రాణించడం కష్టం అవుతుంది. ఆసక్తితో చేరిన విద్యార్థులు కేవలం అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. నిరంతరం తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఆన్‌లైన్ లెర్నింగ్ టూల్స్, ఇంటర్న్‌షిప్స్ వంటి మార్గాలను సాధనాలుగా చేసుకోవాలి.
-ప్రొ. కృష్ణ మోహన్, ఐఐటీ హైదరాబాద్
Tags
- btech cse branches benefits
- benefits of btech in computer science
- Benefits of Studying a BTech Computer Science Course
- benefits of b tech in computer science
- Benefits of Studying a BTech Computer Science Course News in Telugu
- btech computer science course details
- b tech in computer science subjects
- eamcet b tech cse branch selection process
- eamcet b tech cse branch selection process news telugu
- BTech Computer Science Course
- eamcet b tech cse branch benefits
- btech cse ai and ml details in telugu
- btech cse data science details in telugu
- btech cse artificial intelligence and machine learning
- btech cse artificial intelligence and machine learning details in telugu
- btech cse artificial intelligence details in telugu
- btech cse ai and ml syllabus
- EngineeringColleges
- TeluguStates
- CSE
- JobOpportunities
- HigherEducation
- SakshiEducationUpdates