సవాళ్ల...‘లా’- క్లాట్-2012లో 35వ ర్యాంకర్ కావ్యారెడ్డి
ఇంట్లో ఇంజనీర్లే:
మాది కరీంనగర్ జిల్లా. విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే. ప్లస్‌టూలో (ఎంఈసీ) ఇటీవల ఫలితాల్లో 948 మా ర్కులు సాధించాను. నాన్న, అక్క ఇంజనీర్లు. నన్ను కూడా ఇంజనీరింగ్ చేయాలని సూచించారు. కానీ చిన్నప్పటి నుంచీ ‘లా’పై ఆసక్తి ఉండడంతో ఈ రంగాన్ని ఎంచుకున్నా.
క్లాట్ ఎంచుకోవడానికి కారణం అదే:
న్యాయవాద విద్య, ఉద్యోగం చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. సవాళ్లంటే నాకు చాలా ఇష్టం. అందుకే లాయర్‌ను కావాలని కలలు కన్నా. అందుకే ప్లస్‌వన్ ఆరంభం నుంచే క్లాట్ పరీక్షపై దృష్టిసారించా. లా చదివితే బహుళజాతి కంపెనీల్లో లక్షల్లో జీతంతో మంచి ఉద్యోగం వస్తుందనేమాట నిజమే. కానీ జీతం కంటే సవాళ్లతో కూడుకున్న వృత్తిని ఎంచుకోవడమే ఇష్టం. భవిష్యత్తులో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా.
క్లాట్‌కు ప్రిపరేషన్:
ప్లస్‌వన్ నుంచే క్లాట్ సబ్జెక్టులపైనా దృష్టిపెట్టి ప్రిపరేషన్ మొదలుపెట్టి రెండేళ్లు కోచింగ్ కూడా తీసుకున్నా. ప్రత్యేకంగా శని, ఆదివారాల్లో క్లాట్‌పై ఎక్కువ దృష్టిపెట్టాను. రోజుకు 14గంటల చొప్పున ప్రిపరేషన్ కొనసాగించా. ప్రధానంగా క్లాట్ పరీక్షలో లీగల్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టు చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం అంత సులభంకాదు. జీకే కూడా కష్టంగా అనిపించింది. అందుకే ప్రామాణిక పుస్తకాలు చదివాను. పూర్తిస్థాయి నాలెడ్జ్ సాధించడం కోసం పత్రికలు, మనోరమ ఇయర్‌బుక్ లాంటివి చదివాను. ఫస్ట్‌ఇయర్‌లో ఇంగ్లిష్, మ్యాథ్స్‌పై బాగా పట్టుసాధించాను. సెకండ్ ఇయర్‌లో క్లాట్ ప్రిపరేషన్‌లో భాగంగా లాజికల్ రీజనింగ్, జీకేపై అవగాహన పెంచుకున్నా. ప్రతిరోజు ఒక ప్రీవియస్ పేపర్ చొప్పున దాదాపు అన్ని పాత క్లాట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేశా.
టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది:
జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్(క్లాట్)కు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 25వేల మంది హాజరయ్యారు. ఇంతమంది పరీక్ష రాస్తున్నప్పుడు మొదట్లో కొంచెం భయపడ్డా. ఫస్ట్‌ర్యాంకు వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ చేయడం, ప్రామాణిక మెటీరియల్ చదవడంతో పరీక్ష బాగా రాశాను. మంచి మార్కులు సాధిస్తాననే నమ్మకం కలిగింది. కానీ ఫలితాలొచ్చాక జాతీయస్థాయిలో 35వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించడం నిజంగా నమ్మలేకపోతున్నా.. చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మానాన్న పట్టరాని ఆనందంతో ఉన్నారు.
ప్లస్‌టూ తర్వాత ఇంజనీరింగ్ చేయమని చాలామంది పేరెంట్స్ ఒత్తిడి తెస్తుంటారు. కానీ నేను లా కెరీర్ ఎంచుకుంటానంటే.. ఇంట్లో సపోర్ట్ చేశారు. అందువలనే ఈ విజయం సాధించగలిగాను.
నల్సార్‌లో చేరతా!:
క్లాట్‌లో మంచి మార్కులు రావడంతో దేశంలో పేరొందిన 14 లా యూనివర్సిటీల్లో ఎక్కడైనా చేరే అవకాశం లభించింది. అందుకే ఎక్కడ బాగుంటుందనేదానిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నా. నేషనల్ లా స్కూల్, బెంగళూరు, లేదా నల్సార్‌లా వర్సిటీ, హైదరాబాద్‌లో చేరాలనుకుంటున్నా!
భవిష్యత్తు లక్ష్యం అదే:
న్యాయవిద్యలో బాగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటా. ఎల్‌ఎల్‌బీ అయ్యాక ఉన్నత విద్య అభ్యసించడంతోపాటు లాలో ప్రాక్టీస్ చేస్తా.
క్లాట్ రాయాలనుకునేవారికి సలహా:
లా చాలా ముఖ్యమైన కెరీర్. కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లు ఈ కెరీర్లో వేగంగా ఎదగడానికి అవకాశం ఉంది. క్లాట్ జాతీయస్థాయి పరీక్ష కావడంతో ఏటా ప్రశ్నపత్రంలో అనేక మార్పులు చేస్తున్నారు. ప్రశ్నలు అడిగే విధానం లోతుగా ఉంటుంది. సాదాసీదా ప్రిపరేషన్ చేస్తే విజయం సాధించడం కష్టమే. అందుకే సబ్జెక్టును బాగా చదివి అర్థం చేసుకుని, తార్కికంగా ఆలోచించేవాళ్లు పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
ఆల్ ద బెస్ట్!!